21-11-2025 12:10:18 AM
సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : సిగాచి మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మీడియా సాక్షిగా హామీ ఇచ్చి పరిహారాన్ని పరిహాసంగా మార్చారని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం బహిరంగ లేఖ రాశారు. నాలుగు నెలలు గడిచినా బాధితులకు పరిహారం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితుల చేతికి అందింది కేవలం రూ. 26 లక్షలు మాత్రమే అని, ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి ఇంకా రూ. 74 లక్షలు బాకీ పడ్డారని, ఇది మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా మీరు ఇప్పించే నష్టపరిహారం లో కలిపి లెక్కలు చెప్పడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.