21-11-2025 01:22:12 AM
కొడుకును కడసారి చూసి విలపించిన తల్లి
చర్ల, నవంబర్ 20: మావోయిస్టు అగ్రనేత, సౌత్‌బస్తర్ బెటాలియన్ కమాండర్ మద్వి హిడ్మా, ఛతీస్‌గఢ్ రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యురాలు, ఆయన భార్య మడకం రాజే మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మద్వి హిడ్మా మృతిచెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం రెండు రోజుల తర్వాత మృతదేహాలను బుధవారం అర్ధరాత్రి వారి కుటుంబానికి అప్పగించారు.
అనంతరం ఛతీస్‌గఢ్‌లోని ఆయన స్వగ్రామమైన పూవర్తికి తరలించారు. మృతదేహం గ్రామానికి రావడంతో హిడ్మా తల్లి మాంజు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించారు. నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి తన కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించగా, గ్రామంలోని బంధువులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కేవలం 50 ఇళ్లు ఉన్న ఈ గ్రా మంలో సగానికి పైగా ఇళ్లు మూతపడగా.. గ్రామస్తులు భయంతో గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం. హిడ్మా దంపతుల అంత్యక్రియలను గ్రామంలో నిర్వహించినట్లు సమాచారం. దశాబ్దాలుగా అడవుల్లో గడుపుతూ, మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అగ్రనేత అంత్యక్రియలు సజావుగా పూర్తయ్యేలా ఆ ప్రాంతంలో భద్ర తా బలగాలు పటిష్టచర్యలు తీసుకున్నాయి.
మావోయిస్టు చరిత్రలో పూవర్తి కీలకం
పూవర్తి గ్రామం మావోయిస్టు చరిత్రలో కీలక స్థానం ఉన్నదిగా భావిస్తారు. 50 ఇళ్లే ఉన్న గ్రామం నుంచి ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టుల్లోకి మార్చిన హిడ్మా, ఇక్కడి యువతపై తీవ్ర ప్రభావం చూపాడని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. హిడ్మా తర్వాత ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా కీలక నేతగా ఉన్నాడు. ఈ ప్రాంతంచాలా కాలం గా మావోయిస్టుల నియంత్రణలో ఉండడం తో భద్రతా వ్యవస్థలు ఇక్కడ ప్రవేశించలేదు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పువర్తి పోలింగ్ బూత్ పరిధిలోని 547 ఓట్లలో కేవలం 31 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కానీ ఈ గ్రామం నుంచి ఒక్క ఓటు పడలేదు. హిడ్మా తలపై ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు రూ.1.80కోట్ల రివార్డు ప్రకటించాయి.