calender_icon.png 19 December, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేము అందిస్తున్న పథకాలే మా విజయానికి కారణం: సీఎం

18-12-2025 05:14:19 PM

హైదరాబాద్: రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలకు ఎన్నికలు పూర్తయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని.. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనా ఫలితాలు సాధించిందని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ఆదరించారని అన్నారు. 7522 గ్రామ పంచాయితీలను కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, 820 సర్పంచ్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారన్నారు. 62 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, చాలా గ్రామల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేసి సహకరించుకున్నాయని అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ కలిసి 33 శాతం సీట్లను గెలుచుకున్నాయని, పంచాయితీ ఎన్నికల ఫలితాలు మా రెండేళ్ల పాలనకు తీర్పుగా భావిస్తున్నామని తెలిపారు. 94 శాసనసభ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల్లో గెలిచాయని, అందులో 87 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించిందన్నారు. బీఆర్ఎస్ 6 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు సాధించిందని, ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ అధిక స్థానాలు గెలిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు 21 నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించామని, రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైనా ఆధిక్యం సాధించిందని పేర్కొన్నారు. పేదలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి కారణం అని.. కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ కలిసి 8335 పంచాయితీలు గెలిచారన్నారు.