18-12-2025 04:45:29 PM
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం జీహెచ్‌ఎంసీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. పట్టణ ప్రణాళిక నిబంధనలను అతిక్రమిస్తూ ప్రజా స్థలాలు, ప్రధాన రహదారులకు అడ్డుగా ఏర్పాటు చేసిన షెడ్లను గుర్తించిన అధికారులు వాటిని తొలగించారు. అక్రమ నిర్మాణాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రాకపోకలకు అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. ముందస్తుగా నోటీసులు జారీ చేసినప్పటికీ యజమానులు స్పందించకపోవడంతో కూల్చివేతకు దిగాల్సి వచ్చిందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.