calender_icon.png 14 September, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు

05-12-2024 12:50:19 PM

ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల

రోటీ, కపడా, ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం

పేదలే తొలి ప్రాధాన్యత

ప్రజలకు తలవంచక తప్పదు

కేసీఆర్, బండి సంజయ్ ఆహ్వానిస్తాం

హైదరాబాద్: ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. యాప్ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల.. రోటీ, కపడా, ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం అన్నారు. ఇల్లు, వ్యవసాయ భూమిని ఆత్మగౌరవంగా భావిస్తారని చెప్పారు. అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూ పంపిణీ పథకాలను ప్రారంభిచారని సీఎం తెలిపారు. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదన్నారు. రూ. 10 వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇవాళ రూ. 5 లక్షలకు చేరుకుంది. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గతంలో కేసీఆర్ రద్దు చేసిన గృహనిర్మాణశాఖను పునరుద్ధరించామని సీఎం వెల్లడించారు. కాస్త ఆర్థిక పరిస్థితి బాగున్నవారు.. కొంచెం పెద్దగా ఇల్లు నిర్మించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తొలిదశలో 4.50 లక్షల ఇల్లు నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చామని రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. తొలి దశలో అత్యంత పేదలే తమ తొలి ప్రాధాన్యత అన్నారు. తొలిదశలో ఎస్సీలు, ఎస్టీలు, టాన్స్ జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధన్యత ఇస్తామన్నారు. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించి ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. నియోజకవర్గ కోటా 3500 ఇళ్లకు సంబంధం లేకుండా ఐటీడీఏకు అదనంగా ఇస్తామన్నారు. గోండులు, ఆదివాసీలకు కోటాతో సంబంధం లేకుండా ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి సూచించారు.

గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అసంపూర్తిగా వదిలేసిందని సీఎం ఆరోపించారు. పేదల ఇళ్ల నిర్మాణ పథకాన్ని కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వేలాది ఇళ్లను పూర్తి చేయకుండా ఎక్కడికక్కడ వదిలేశారని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని తాము పూర్తి చేస్తున్నామన్నారు. అసంపూర్తి ఇళ్లను పూర్తి  చేసేందుకు ఇటీవల రూ. 195 కోట్లు విడుదల చేశామని తెలిపారు. కేసీఆర్ తనకు అవసరమైన ప్రగతి భవన్ ను ఆగమేఘాల మీద పూర్తి చేశారని పేర్కొన్నారు. వాస్తు కోసం సచివాలయాన్ని కూలగొట్టి కొత్తదాన్ని వేగంగా నిర్మించారు. ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను వేగంగా నిర్మించుకున్నారు. గజ్వేల్, జన్వాడ ఫామ్ హౌజ్ ల నిర్మాణంపై మాత్రమే కేసీఆర్ దృష్టి పెట్టారని మండిపడ్డారు. పేదల ఇళ్ల పథకాన్ని కేసీఆర్ ఏనాడు ప్రాధాన్యత అంశంగా భావించలేదని తెలిపారు.

రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించింది. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు ప్రజల తరుఫున సీఎంలను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. సీఎంను కలిసి నియోజకవర్గానికి నిధులు కావాలని అడిగేవారు. సీఎంగా కేసీఆర్ పదేళ్లపాటు ఏ ప్రతిపక్ష నాయకుడిని కలవలేదని విమర్శించారు. అధికార, విపక్షనేతలు కలుసుకోకూడదన్నట్లు తయారు చేశారని ద్వజమెత్తారు. వాళ్లు చేయనిది.. మేం కూడా చేయొద్దన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ తన ఇద్దరు పిల్లలను తమపైకి ఉసిగొల్పి అన్నింటిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

పదేళ్ల పాటు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురాలేదన్న సీఎం రేవంత్ ఏ పాలకుడైనా ప్రజల అభిప్రాయాలకు తలవంచక తప్పదన్నారు. నిజాం ప్రభువు కూడా అయిష్టంగానే హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారని గుర్తుచేశారు. నిజాం ప్రభువు కూడా చివరకు ప్రజల అభిప్రాయానికి తలవంచారని తెలిపారు. కేసీఆర్ కూడా ప్రజల తీర్పును ఇప్పటికైనా గౌరవించాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యనించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేంది లేదన్నారు.  ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను నిర్మిస్తామని సీఎంచెప్పారు. ఈ నెల 7,8,9 తేదీల్లో ప్రభుత్వ ఉత్సవాలు జరుగుతాయని, ప్రభుత్వ ఉత్సవాలకు విపక్ష నేతలను కూడా ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వేడుకలకు కేసీఆర్, బండి సంజయ్ ను ఆహ్వానిస్తామన్నారు. సచివాలయం ప్రాంగణం, నెక్లెస్ రోడ్డులో వేడుకలు ఉంటాయన్నారు. మూడు రోజుల పాటు పండగ వాతావరణంలో కార్యక్రమాలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.