18-10-2025 07:15:49 PM
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శనివారం నియామక పత్రాల అందజేత కార్యక్రమం శిల్పకళవేదికలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సీఎస్, డీజీపీ హాజరయ్యారు. గ్రూప్-2 విజేతలతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆహ్వానం అందింది. మొత్తం 16 శాఖల్లో 18 రకాల పోస్టులకు సంబంధించిన 782 మంది గ్రూప్-2 ఉద్యోగాలకు సీఎం రేవంత్ చేతుల మీదగా నియామకపత్రాలు అందజేస్తారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... నిరుద్యోగులు అశించినట్లే నియామక ప్రక్రియను ప్రజాప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు.
దీపావళి వేళ ఇంతమంది కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని సీఎం కొనియాడారు. యూనివర్సిటీల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఎంతోమంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. తాము చనిపోయినా పర్వాలేదు.. యువత ఆకాంక్షలు నెరవేరుతాయని బలిదానాలు చేశారని చెప్పారు. ఎంతోమంది త్యాగాలతో వచ్చిన తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అల్లుడిని అంబానీగా, కుమారుడిని అదానీగా చేయడం కోసమే గత పదేళ్లు పాలన జరిగిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం.. కూలేశ్వరం అయి ఉండేది కాదని, రూ.లక్ష కోట్లతో కట్టిన ఒక ప్రాజెక్టు మూడేళ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడ జరగలేదని వ్యంగ్యంగా మాట్లాడారు.
తన ఫామ్ హౌజ్ లో ఎకరా పంటపై రూ.కోటి ఆదాయం వస్తుందని ఒక పెద్దాయన చెప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు, హోదాలను తన కుటుంబీకులకే ఇచ్చిందని, ఎన్నికల్లో ఓడిపోయిన వారికే వెంటనే ఎమ్మెల్సీలు, ప్లానింగ్ కమిషన్ పదవులు ఇచ్చారని సీఎం ఎద్దేవా చేశారు. పదిహేనేళ్లపాటు గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే.. పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. తన కుటుంబం, బంధువుల ఉద్యోగాల గురించి ఆలోచించినట్లు యువత గురించి ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలలో చదివిన తను ఈ స్థాయిలో ఉన్నానంటే మీ ఆశీర్వాదాలే కారణం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రూ.3 కోట్లు తీసుకుని గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు ఆరోపణలు చేశారని, కష్టపడి చదివిన వారిని అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా..? అని ప్రశ్నించారు. వందేళ్లుగా దేశంలో జనగణనతో పాటు కులగణన జరగలేదని, గతంలో ఎన్నడూ జరగని కులగణన.. కాంగ్రెస్ పోరాటం వల్లే త్వరలో సాధ్యం కానుందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లపాటు దోచుకున్న సొమ్ము కోసం ఆ కుటుంబంలో విభేదాలు వచ్చాయని, ఏ విధంగా దోచుకున్నారో వాళ్ల కుటుంబ సభ్యులే బయటపెడుతున్నారని సీఎం చెప్పారు.