18-10-2025 07:19:03 PM
హైదరాబాద్: తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని విద్యార్ధులు ఆశించారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే కలలు నెరవేరుతాయని భావించారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. శిల్పకళ వేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం వచ్చాక పదేళ్లు ఎదురుచూసిన నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని.. నిరుద్యోగుల పదేళ్ల ఎదురుచూపులకు ఇప్పుడు ఫలితం లభిస్తోందని అన్నారు.
ఇంత భారీ సంఖ్యలో నియామక పత్రాలు ఇవ్వటం గతంలో చూడలేదని.. యువత ఆశలు నెరవేర్చడానికే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అన్ని పార్టీలను ఒప్పించి సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డక కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవడంతో ప్రజల ఆశలు నెరవేరలేదని తెలిపారు. తెలంగాణలో గత పదేళ్లు ఒక్క కుటుంబమే బాగుపడిందని, ఇందిరమ్మ రాజ్యం వస్తేనే.. న్యాయం జరుగుతుందని యువత భావించిందన్నారు. నిరుద్యోగులు ఆశించినట్లే నియామక ప్రక్రియ వేగవంతం చేశామని, ఉద్యోగం అంటే.. కేవలం పని, వేతనం మాత్రమే కాదు అని తెలిపారు. ఒక దీక్షతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాట్లు భట్టి విక్రమార్క కోరారు.