29-07-2025 05:02:33 PM
హైదరాబాద్: హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చే లక్ష్యంతో దీర్ఘకాలిక సంస్కరణలను ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏ&యుడి) శాఖ సీనియర్ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాబోయే పాతికేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణాభివృద్ధి విధానాలను రూపొందించాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు.
పట్టణ గందరగోళాన్ని తగ్గించడానికి, భద్రతను మెరుగుపరచడానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు, భూగర్భ విద్యుత్ కేబులింగ్ అమలుతో సహా మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కోర్ అర్బన్ ప్రాంతాలలో కాలుష్యాన్ని నియంత్రించడానికి శాశ్వత పరిష్కారం కనుగొన్నాలని ఆయన తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ఎదుర్కొంటున్న పట్టణ సవాళ్లను అధ్యయనం చేయాలని, హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి రాకుండా పరిష్కార మార్గాలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. స్థిరమైన పట్టణ జీవనాన్ని నిర్ధారించడానికి బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, కాలుష్య తగ్గింపు వ్యూహాల అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎంఏ అండ్ యూడీ కార్యదర్శులు మాణిక్ రాజ్, ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె. శశాంక, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండి అశోక్ రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్ ఎండి ఈవీ నరసింహారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారని అధికారిక ప్రకటనలో తెలిపారు.