25-12-2025 12:24:58 AM
అర్థరాత్రుళ్లు అడ్డగోలుగా తవ్వకాలు, రవాణా
మట్టి మాఫియాకు సహకరిస్తున్న అధికార యంత్రాంగం
ప్రభుత్వ ఆదాయానికి కోట్లల్లో గండి
నాగర్ కర్నూల్ డిసెంబర్ 24 ( విజయక్రాంతి ): రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేరుతో తన అనుచర వర్గం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మట్టి దందాకు తెర లేపుతోంది. అధికార పార్టీ మాదే మంత్రి మావాడే నంటూ పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రభుత్వ భూములు, గుట్టలను ధ్వంసం చేస్తూ అడ్డగోలుగా భారీ హిటాచీలతో గోతులు తీసి టిప్పర్ల ద్వారా మట్టి సరఫరా చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు వెనకేసుకుంటున్నారు.
రాత్రుళ్ళు టిప్పర్లు, పగలు ట్రాక్టర్లు రోడ్ల నిండా హంగామా చేస్తున్నాయి. అడిగిన అధికారులకు మంత్రి మావాడే అంటూ జవాబిస్తూ జాతీయ రహదారి నిర్మాణ పనులు, ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో తమకు నచ్చినట్లు మట్టిని తరలిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇతరులకు మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.
నిబంధనల ప్రకారం మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి కానీ అధికార పార్టీ అండ దండ పుష్కలంగా ఉందంటూ కొంతమంది మండల, జిల్లా స్థాయి అధికారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ ఖద్దరు నేతలు పగలు రాత్రి అని తేడా లేకుండా మట్టి తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దగ్గర్లోని ఇతర రైతుల పంట పొలాల గుండా అక్రమంగా ప్రయాణిస్తూ ప్రశ్నించిన వారిని టిప్పర్ తో తొక్కిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ తమ వెనకాల మంత్రి అండదండలు ఉన్నాయంటూ ఇతర పార్టీ లీడర్లను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ మధ్య జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేసి అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి గోరంగా పరాజయం పాలైనట్లు అందుకు ప్రధాన కారణం అక్రమ మట్టి తరలింపు, అహంకారం, దౌర్జన్యాలేనని బాహాటంగా చర్చించుకుంటున్నారు. అయినప్పటికీ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాంటివారిని ప్రోత్సహిస్తున్నారా అని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.
మామూళ్ల మత్తులో మైనింగ్, రెవెన్యూ శాఖలు!
నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ భూములు, గుట్టలు ధ్వంసం అవుతున్న సంబంధిత మండలాల రెవెన్యూ అధికారులు జిల్లా మైనింగ్ శాఖ అధికారులు పోలీసు అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం వెనక అవినీతి ముడుపుల మతలబు ఉందని చర్చ జరుగుతుంది.
తెలకపల్లి మండలం రామగిరి గుట్టలు, తూడుకుర్తి గ్రామంలోని ఎర్రగుట్టలు, గన్యాకుల గ్రామంలోని గుట్టలు, పెద్దకొత్తపల్లి మండల పరిసరాల్లోని కుమ్మరి గుట్టలు, కోడేర్ ఇతర ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన భారీ కొండలను సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధ్వంసం చేసి మట్టి దందాకు తెర లేపారు. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఒక్కో ప్రాంతంలో గుట్టలను తవ్వుకోవడం కోసం తెర వెనక ధర నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయా ప్రాంతావాసులు తరచూ రెవెన్యూ పోలీస్ మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలించడం కోసం రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు ఇతర ప్రైవేటు వ్యక్తుల చేత అద్దె పద్ధతిన టిప్పర్లను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే ఒక సామాన్యుడు ట్రాక్టర్ మట్టి తీసేందుకు ప్రయత్నించినా వెంటనే వాలిపోయే రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులు భారీ స్థాయిలో హిటాచిలతో పెద్ద మొత్తంలో గోతులు తీసినా ఎందుకు స్పందించడం లేదో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది. మట్టి మాఫియా చెప్తున్నట్లుగా ఇందుకు నిజంగానే మంత్రి అండగా నిలిచాడా అన్న అనుమానాలు లేకపోలేదు.
బిఆర్‌ఎస్ నేతల అవినీతి అక్రమాలు ఆగడాలను విసిగి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ప్రజలకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమైన నేతల అనుచరులు చేస్తున్న అరాచకాలు భంగపాటుకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మట్టి దందాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు వాతావరణ సమతుల్యత దెబ్బతిని భారీ వృక్షాలు నేలకూలి ఇతర జీవరాసులు కూడా మృత్యువాత పడే ప్రమాదం లేకపోలేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయా గ్రామ పంచాయతీలు పరిపాలన పగ్గాలు చేతబట్టిన నేపథ్యంలో ఇప్పటికైనా ఈ అక్రమాలకు కళ్లెం పడుతుందా వేచి చూడాలి.