calender_icon.png 25 December, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే వేదికపైకి థాక్రే సోదరులు

25-12-2025 01:23:43 AM

  1. మహారాష్ట్రలో ౨౦ ఏళ్ల తర్వాత కీలక పరిణామం   

ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటన

కూటమి ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ

ముంబై, డిసెంబర్ 24: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత థాక్రే సోదరులు చేతులు కలిపారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే కలుసుకున్నారు. ముంబై స్థానిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తామని ప్రకటించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన(యూబీటీ), ఎంఎన్‌ఎస్ కలిసి పోటీ చేస్తాయని ఆయా పార్టీల అగ్రనేతలు పేర్కొన్నారు.

‘శివసేన(యూబీటీ), ఎంఎన్‌ఎస్ కూటమి భాగస్వాములు. ముంబైకి మరాఠి మేయర్ వస్తారు’ అని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ థాక్రే పేర్కొన్నారు. బుధ వారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అలాగే అదే సమావేశంలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ ‘ఏం జరిగినా.. ముంబై మాతోనే ఉంటుంది’ అని అన్నారు.

జనవరి 15న 28 కార్పొరేషన్లకు ఎన్నికలు

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 28 కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే 32 జిల్లాల కౌన్సిళ్లు, 336 పంచాయతీ సమితులకు ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఇదొక చారిత్రాత్మక ప్రారంభమని ఉద్ధవ్ పార్టీ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన కూటమితో అసంతృప్తిగా ఉన్నవారు తమతో కలిసి రావొచ్చని పిలుపు నిచ్చారు. కొన్ని నెలల క్రితం తొలిసారి ఈ ఇద్దరు ఠాక్రేలు ఒకే వేదికపై మెరిశారు. 2005లో విడిపోయిన వీరు దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు.

అంత బిల్డప్ అవసరం లేదు: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ఠాక్రే సోదరుల కలయికపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘వారేదో గొప్ప కార్యం చేసినట్లు.. రష్యా, ఉక్రెయిన్ దేశాలు యుద్ధం ఆపి ఒక్కటైనట్లుగా బిల్డప్ ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు.

ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు కలిసి రావడాన్ని చూస్తుంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు శాంతి చర్చల కోసం ఒకే వేదికపైకి వచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

వీరు సిద్ధాంతాల కోసం కలవ లేదని, కేవలం ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వల్లే కలిశారని, ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయంగా అస్తిత్వాన్ని కాపాడు కోవడానికి పడుతున్న పాట్లు ఇవని, దీనివల్ల ముంబై అభివృద్ధికి ఎలాంటి లాభం లేదని ఫడ్నవీస్ కొట్టిపారేశారు.