25-12-2025 12:00:00 AM
సూర్యాపేట, డిసెంబర్ 24 (విజయక్రాంతి) : నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాపుల యాజమాన్యాలు కొన్నిచోట్ల ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. కొన్ని వైన్ షాపుల వారు సిండికేట్ అయ్యి డబ్బు సంపాదనకు అడ్డుదారులు తొక్కుతున్నారు.
వేరువేరు చోట్ల అనుమతులు తీసుకొన్న రెండు వైన్ షాపులను ఒకే ఆవరణలో ఏర్పాటు చేసి ఒక దానిలో రిటైల్, మరొక దానిలో హోల్ సేల్ అమ్మకాలు జరుపుతున్నారు. ఇదంతా ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకు వైన్ షాపుల యాజమాన్యాలు అధికారులకు అందజేస్తున్న మామూలే కారణమని చెబుతుండడం గమనార్హం.
జిల్లా అంతట అదే తంతు : 2025 _ 27 సంవత్సరాలకు గాను జిల్లా వ్యాప్తంగా 93 వైన్ షాపులకు అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే ఈ షాప్ ల్లో యజమానులు అధికంగా అమ్మకాలు చేపట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందాలనే ఆశతో బెల్ట్ షాపులకు తెర లేపారు. ఒక్క ఊర్లో 10 నుండి 20 షాపులు ఉన్నాయంటే పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.
రూ.5 వేలు అడ్వాన్స్
గ్రామాలలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయాలంటే వైన్ షాప్ వారికి రూ.5 వేలు అడ్వాన్స్ చెల్లించాలనే రూల్ పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా కోదాడ, హుజూర్ నాగర్ నియోజకవర్గాల్లోని వైన్ షాపులలో బెల్టు పేరిట రేటుని మెల్ట్ చేశారు అంటూ మందుబాబులు బాహాటంగానే చెబుతుండడం గమనించదగిన విషయం. వైన్ షాపులలో ఏ బ్రాండ్ మద్యం సీసాను కొన్నా ఎమ్మార్పీకే అమా ల్సి ఉంటుంది. కానీ బెల్ట్ షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ.15 అదనం చేసి అమ్ముతున్నారని బెల్ట్‌షాప్‌ల నిర్వాహకులు తమ సన్ని హితుల వద్ద చెబుతుండటం గమనార్హం.
స్టిక్కర్ వేసి అమ్మకాలు
సిండికేట్ అయిన మద్యం దుకాణదారులు తమ వ్యాపారంకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మద్యం బాటిళ్లపై స్టిక్కరులు వేసి అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాప్ కి దాని పరిధిలోని కొన్ని గ్రామాలను కేటాయించి అదే షాపు మధ్య అమ్మేలా ఆ షాప్ కోడ్ వచ్చే విధంగా స్టిక్కర్లు తయారు చేయించి ప్రతి బాటిల్ పై ఆ స్టిక్కర్ వేసి అమ్ముతున్నారు.
నిత్యం తనిఖీలు
బెల్టు షాపుల్లో తమ షాప్ లోనీ మందు మాత్రమే అమ్మేలా కొందరు వ్యక్తులకు జీతాలు ఇస్తూ నిత్యం బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. వీరు బెల్టు షాపులోకి వెళ్లి ఇల్లంతా సోదించి ప్రతి మద్యం బాటిల్ క్షుణ్ణంగా పరిశీలించి తమ స్టిక్కర్ ఉన్నదా లేదా అనేది చూస్తున్నారు. ఒకవేళ వేరే మందు అమ్మితే వారిపై కేసులు చేస్తున్నారు.
మందుబాబులపై మరింత భారం : సాధారణంగా వైన్ షాపుల్లో ఏ బ్రాండ్ బాటిల్ కొనుగోలు చేసిన ఎమ్మార్పీ ధరలకే ఇస్తుంటారు. కానీ బెల్టు షాపులకు మాత్రం ప్రతి బాటిల్ పై రూ.15 అదనం. దానిని మందుబాబులకు మరో రూ.15 లాభం చూసుకుని విక్రయాలు చేస్తున్నారు. దీంతో ఒక్కో బాటిల్ పై రూ.30 అదనపు భారం పడుతుంది.
నెలకు రూ.2 కోట్ల పైనే..
జిల్లాలోనీ తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో వైన్ షాప్ ల వారు అందరికీ ఎమ్మార్పీ కే విక్రయాలు చేపడుతున్నారు. కానీ హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మాత్రం వైన్ షాప్ యజమానులు బెల్ట్ షాప్ లకు ఒక్కో బాటిల్ పై రూ.15 అదనంగా అమ్ముతున్నట్లు నిర్వాహకులే చెబుతున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారుగా 4,500 బెల్ట్ షాపులు ఉన్నట్లు సమాచారం.
వీటిలో రోజుకు సుమారుగా 22,500 మద్యం బాటిల్ల అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. అంటే ఒక రోజులో ఈ మద్యం బాటిళ్ల అమ్మకాల ద్వారా రూ.3.37 లక్షలు అదనంగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ బాటిళ్లను మరో 15 రూపాయలు అదనంగా మందుబాబులకు అమ్మితే.. అది కాస్త మందుబాబులపై రోజుకు రూ.6.75 లక్షల అదనపు భారం మోపినట్టు అవుతుంది.
అంటే రెండు నియోజకవర్గాల్లో కలిపి నెలకు సుమారు రూ.2 కోట్ల పైనే అదనపు ఆదాయం అక్రమంగా వైన్ షాపు యాజమాన్యాలు పొందుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఇంత డబ్బు ఎటువైపు వెళుతుంది అనేది అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఉన్నతాధికారులు దృష్టి పెట్టి తెలుసుకోవాలని, ఈ అక్రమ సంపాదనకు అడ్డుకట్ట వేసి మందుబాబులపై అదనపు భారం లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అలాగే పచ్చని పల్లెల్లో బెల్ట్ ఆగడాలకు అడ్డుకట్ట వేసి ఏ ఇబ్బందులు లేకుండా చూడాలంటున్నారు.