calender_icon.png 12 October, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాలపై సీఎం ప్రత్యేక దృష్టి

12-10-2025 03:44:08 AM

  1. సమస్యల పరిష్కారానికి కృషి
  2. రూ.60 కోట్లు అత్యవసర నిధుల విడుదల 
  3. పదేళ్లలో విద్య, సంక్షేమం భ్రష్టు పట్టాయి
  4. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాం తి): గత ప్రభుత్వ హయాంలో విద్య, సంక్షే మం రెండూ వ్యవస్థలు భ్రష్టుపట్టాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ నేతలు చిల్లర రాజకీయాలతో విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. శనివారం సచివాల యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రస్తుతం సరిదిద్దే చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదన్నారు. విద్యార్థుల భోజనం, వసతి, పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

గురుకులాల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టితో గురుకులాల్లో ఇబ్బందుల పరిష్కారం కోసం రూ.60 కోట్లు అత్యవసర నిధులు విడుదల చేశారని మంత్రి వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీలకు కలిపి నిధులు కేటాయించడం విద్యా ర్థుల సంక్షేమంపై ఉన్న అంకితభావానికి నిదర్శనమన్నారు.

ప్రతి సొసైటీ సెక్రటరీకి నిధుల వినియోగంపై పూర్తి అధికారం ఇచ్చారని, ‘ఫాస్ట్ యాక్షన్ మెకానిజం’ ఏర్పాటు చేసి, ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునే విధానం అమల్లోకి వస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమంపై రాజకీయాలు చేయడం తగదని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు పట్ల అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. 

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల పట్ల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించి వారి భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని యాజమాన్యాలకు విజ్ఞ ప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో మొదటి దఫాలో ఈనెల 20 లోపు, మిగిలిన బిల్లులు ఈనెల చివరిలోగా క్లియర్ చేస్తానని హామీ ఇచ్చారు.