calender_icon.png 5 October, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులపై శీతకన్ను

05-02-2025 01:13:33 AM

  • స్పోర్ట్స్ హబ్ పేరిట గజ్వేల్ లో  20 ఎకరాల భూసేకరణ  

కబ్జాకు గురవుతున్న  క్రీడా హబ్ భూములు 

సొంత నిధులతో క్రికెట్ గ్రౌండ్ ను సిద్ధం చేసుకుంటున్న  క్రీడాకారులు 

గజ్వేల్, ఫిబ్రవరి 4: గజ్వేల్ ను స్పోరట్స్ హబ్ గా మార్చివేస్తామన్న మాజీ సీఎం కేసీఆర్ మాటలు వట్టి మూటలే అయ్యాయి. గజ్వేల్ లో జిల్లా నుండి జాతీయ స్థాయి  వరకు వివిధ క్రీడల్లో ఉత్తమ నైపుణ్యానికి ప్రదర్శిస్తున్న క్రీడాకారులు ఉన్నారు. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ , షటిల్ తదితర క్రీడల్లో ఉత్తమ క్రీడాకారులు గజ్వేల్‌లో ఎంతో మంది ఉన్నా ప్రోత్సహించే వారు లేకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్  గజ్వేల్ ను స్పోరట్స్ హబ్ చేస్తామంటూ 20 ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించారు.  ఇందులో నాలుగు ఎకరాలు ఆర్టిఏ కార్యాలయం వినియోగిస్తుండగా, ప్రభుత్వం నుండి పరిహారం పొందినా ఇంకా కొందరు యజమానులు భూమిని సాగు చేస్తున్నారు. 

ఖాళీగా ఉన్న మరో ఐదు ఎకరాల భూమిని   పట్టణానికి చెందిన  క్రికెట్ క్రీడాకారుడు  పిట్ల ఆంజనేయులు తోటి క్రీడాకారుల కోసం  రూ. 2లక్షల సొంత ఖర్చులతో చదును చేసి వినియోగంలోకి తెచ్చాడు.  ఇప్పటి వరకు క్రీడాకారులు సరైన మైదానం లేకపోవడంతో స్థానికంగా ఉన్న శివాలయం భూమిలోనే క్రీడా పోటీలు జరుపుకుంటు న్నారు.

క్రీడా హబ్ భూమిని చదును చేయ డంతో ఇటీవల విద్యార్థి సంఘాలు క్రీడా పోటీలను నిర్వహించుకున్నాయి. క్రీడాహబ్ కు భూమిని కేటాయించిన సమయంలో పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో క్రీడా పోటీలు నిర్వహించిన గత ప్రభుత్వం హబ్ ఏర్పాటుకు ముందడుగు వేయకపోవడం శోచనీయం. 

క్రీడా హబ్ ఏర్పాటయితే  ఈ ప్రాంత క్రీడాకారులకు ఉన్నత స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనడానికి గొప్ప వేదిక లభించేది. రూ. 100 కోట్ల వ్యయంతో, అన్ని రకాల క్రీడా మైదానాలతో కూడిన క్రీడా హబ్ ను ఏర్పాటు చేస్తున్నామంటూ క్రీడా హబ్ మోడల్ ను కూడా సిద్ధం చేసి క్రీడాకారుల్లో  రేపిన ఆశలు అడియాసలు గానే మిగిలిపోయాయి.

కాగా క్రీడా హబ్ కు కేటాయించిన  భూములకు కబ్జాకు గురవు తున్నాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికా రులు కూడా పట్టనట్టు వ్యవహరించడం శోచనీయం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కెసిఆర్ చొరవ చూపి   క్రీడా హబ్ కి కేటా యించిన భూమిని  ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా,

పూర్తిస్థాయి మైదానాన్ని క్రీడాకారుల కోసం సిద్ధం చేయించాలని  స్థానిక క్రీడాకారులు కోరుతున్నారు. ప్రోత్స హిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు తెస్తాం - పిట్ల ఆంజనేయులు, క్రికెట్ క్రీడాకారుడు. 

గజ్వేల్ లో క్రికెట్ తో పాటు ఫుట్బాల్, కబడ్డీ,వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో ఎంతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారు. అవకాశం వస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పోటీపడి  రాష్ట్రానికి పతకాలు సాధించే సత్తా ఉంది.

కానీ గజ్వేల్ ప్రాంతంలో క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించకపోవడంతో  నిరాశ చెందుతున్నారు.   ఇప్పటికైనా గజ్వేల్లో క్రీడా హబ్ కాకపోయినా మంచి క్రీడా మైదానాన్ని  ఏర్పాటు చేయాలి.