calender_icon.png 5 October, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందని రైతుభరోసా!

05-02-2025 01:16:32 AM

  • పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు
  • జిల్లాలో 21 గ్రామాలకే పెట్టుబడి సాయం
  • సాగు భూములు 3,99,774 ఎకరాలుగా గుర్తింపు
  • సాగుకు యోగ్యం కానివి 6,869 ఎకరాలు 472 గ్రామాల రైతులకు అందని భరోసా

మెదక్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం కొందరికే అందింది. రైతు భరోసా కింద ఈసారి ప్రభుత్వం ఒక్కో ఎకరాకు తొలి విడతలో రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది.

గత డిసెంబర్  26న రైతుభరోసా పథకాన్ని ప్రారంభించినా ఆ రోజున బ్యాంకులకు సెలవు కావడంతో 27న ఉదయం నుండి లబ్దిదారుల ఖాతాల్లో సొమ్ము జమైంది. అర్హులైన రైతులందరికీ ఒకేసారి కాకుండా మండలానికి ఒక గ్రామం చొప్పున అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని జమ చేసింది.

మెదక్ జిల్లా వ్యాప్తంగా 3,99,774 ఎకరాలకే భరోసా అందనుంది. ఈ మేరకు అధికారులు సాగు భూమి లెక్క తేల్చారు. అయితే ఇందులో 5-10 శాతం మాత్రమే రైతులకు భరోసా అందుకోగా ఇంకా పెద్ద సంఖ్యలో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో వ్యవ సాయానికి ఆర్థిక సాయాన్ని అందించాలని కోరుతున్నారు. 

జిల్లాలో 472 గ్రామాలకు అందని భరోసా..

మెదక్ జిల్లాలో మొత్తం 4,06,643 ఎకరాల భూములుండగా అందులో 3,99,774 ఎకరాలు మాత్రమే సాగుకు యోగ్యంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. 6,869 ఎకరాలు సాగుకు యోగ్యం కానివని నిర్ధారించారు. గత ఏడాది సుమారు 3.94 లక్షల ఎకరాలకు రూ.194.54 కోట్ల రైతు భరోసా అందించారు.

అయితే ఈసారి భరో సా జిల్లాలోని 21 మండలాల్లోని 493 గ్రామాలుండగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయడంతో కేవలం 21 గ్రామాలకు గాను 14,819 మందికి రూ.14.52 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. ఇంకా 472 గ్రామాల్లోని రైతులకు రైతు భరోసా అందా ల్సి ఉంది.  

అన్నదాతల ఎదురుచూపులు..

యాసంగిలో రైతులకు ప్రభుత్వం రైతు భరోసా అందించింది. అయితే రబీ సీజన్ పనులు ప్రారంభమై నెలరోజులైనప్పటికీ రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేసి కలుపు లు కూడా తీస్తున్నారు. జిల్లాలో లక్షలాది మంది రైతులు రైతు భరోసా ఎప్పుడొ స్తుందా అని ఎదురుచూస్తున్నారు. 

సాగుకాని భూములను ఫ్రీజ్ చేశాం..

జిల్లాలో సాగుకు యోగ్యంకాని భూము లను ఫ్రీజ్ చేశాం. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 21 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. ఇప్పటికే పూర్తిస్థాయి నివేదికలను అందించాం. ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు అందిస్తే అప్పుడు మిగతావారికి డబ్బులు జమ అవుతాయి.

 వినయ్, ఇంచార్జి వ్యవసాయాధికారి, మెదక్