16-08-2025 10:52:46 PM
కుభీర్ తాసిల్దార్ శివరాజ్
విఆర్ఏలను అప్రమత్తం చేసిన తహసిల్దార్
ఫోన్లో ప్రతి గ్రామంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్న తహసిల్దార్
కుభీర్,(విజయక్రాంతి): ఋతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు రోజు అయినప్పటికీ శనివారం ఆయన కుబీర్ తో పాటు పలు గ్రామాలను సందర్శించి గ్రామ రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు సలహాలను అందజేశారు. గ్రామాలలో మట్టితో కట్టిన ఇండ్లు, పాత నివాసాలు కలిగి ఉన్నవారు సేఫ్ గా ఉన్న ఇండ్లకు వారిని తరలించేందుకు కృషి చేయాలన్నారు.
చెరువుల్లోకి ఎవరిని చేపలు పట్టేందుకు వెళ్లని వద్దని, పశువులను మేపేందుకు వెళ్లకుండా గ్రామంలో దండోరా లేదా మైకుల ద్వారా అనౌన్స్ చేయించాలని సూచించారు. గ్రామాల్లోని ఇనుప విద్యుత్ స్తంభాలను తాగకుండా జాగ్రత్త పడే విధంగా గ్రామస్తులను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాల్లోని వర్షాల వల్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా ఆదేశించారు. రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.