26-08-2025 12:36:01 AM
కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల: డబుల్ బెడ్ రూమ్ గృహాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నిటిని త్వరితగతిన పూర్తి చేసి,ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం దౌదర్‌పల్లి సమీపంలో ఉన్న రెండు పడక గదుల ఇండ్ల పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సెప్టెంబర్ మొదటి వారంలో గృహాల ప్రారంభోత్సవం చేపట్టనున్నందున, మిగిలి ఉన్న పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
దాదర్ పల్లి వద్ద నిర్మితమైన 715 ఇళ్లలో విద్యుత్ సౌకర్యాలు, పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నందున, వాటిని ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారి నుంచి ఇళ్ల వరకు చేరుకునేలా రహదారి పనులు చేపట్టి పూర్తి చేసి, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వాతావరణం కల్పించాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు.
ఇళ్ల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి, పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టి, అక్కడ నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని మున్సిపల్ శాఖకి ఆదేశించారు. అంతకుముందు ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు తగు సూచనలు చేశారు.