24-05-2025 12:13:51 AM
ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేటుకు రెఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..
నల్లగొండ టౌన్, మే 23 : గత డిసెంబర్లో కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చిన దామరచర్ల మండలం జైత్రం తండాకు చెందిన అడావత్ రాజేశ్వరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం సరిగా లేనప్పటికీ సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడంలో నిర్లక్ష్యం వహించి రాజేశ్వరి మృతికి కారణమైన మిర్యాలగూడ శిరీష ఆస్పత్రిపై మెజిస్టీరియల్ విచారణతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
గత సంవత్సరం డిసెంబర్లో మృతురాలు రాజేశ్వరి కాన్పు కోసం మిర్యాలగూడలోని శిరీష ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ శిరీష చివరి క్షణం వరకు ఆసుపత్రిలో ఉంచుకొని అనంతరం నల్గొండ లోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి పంపించగా, డిసెంబర్ 28 న నల్గొండ ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ప్రసవానంతరం రాజేశ్వరి మృతి చెందిన విషయం తెలిసిందే.
రాజేశ్వరి మృతి చెందిన సంఘటనలో నిర్లక్ష్యం వహించిన మిర్యాలగూడ శిరీష ఆస్పత్రి పై మెజిస్టేబుల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ కేసు విచారణకు రాగా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పేషెంట్ల అవగాహన లోపం, నిర్లక్ష్యం, తదితర కారణాలవల్ల మాతృ మరణాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ , డి సి హెచ్ ఎస్ మాతృనాయక్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణ కుమారి , జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డిప్యూటీ డిఎంహెచ్వోలు, వైద్యాధికారులు, ఎం సి హెచ్ సూపర్వైజర్లు, సిడిపివోలు, ఆశ కార్యకర్తలు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.