24-05-2025 10:42:02 PM
కోట్లు దండుకునే ప్లాన్ వేసిన పీ ఎస్ ఆర్..
బెదిరిస్తూ.., భూములు లాక్కుంటున్న నేత..
కోట్లు దండుకుంటు.. రైతులకు ఇచ్చేది రూ. 13.50 లక్షలే..
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు..
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల ఎమ్మెల్యే ఇండస్ట్రీయల్ పార్కు పేరిట దళితుల, బీసీలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు(Former MLA Nadipelli Diwakar Rao) ఆరోపించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మంచిర్యాల కార్పొరేషన్ (గతంలో హాజీపూర్ మండలం) పరిధిలో వేంపల్లి గ్రామ శివారులో సాగు చేసుకుంటున్న వేంపల్లి, ముల్కల్ల, పోచంపాడు రైతుల నుంచి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూసేకరణ దళిత, బీసీల భూములు తక్కువ పరిహారం చెల్లించి అధికారులు, అధికార పార్టీ నాయకులు బెదిరించి భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఎకరానికి రూ. 13.50 లక్షలు మాత్రమే చెల్లించి అధికార పార్టీ నాయకులు బెదిరించి భూములు లాక్కున్నారన్నారు.
బెదిరిస్తూ.. భూములు లాక్కుంటున్న నేత...
దళిత, బీసీ రైతులను బెదిరించి భూములు లాక్కున్న వారికి ఇవ్వాల్సిన డబ్బు(నష్ట పరిహారం) న్యాయంగా చెల్లించాలని మాజీ ఎంఎల్ఏ దివాకర్ రావు డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చినంక ఇండస్ట్రియల్ పార్క్ చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ భయపెట్టి, బెదిరించి వాళ్ల దగ్గర నుంచి అన్యాయంగా భూములు తీసుకుంటే, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దళిత, బీసీలకు అండగా ఉంటామన్నారు. బెదిరిస్తూ.., భూములు లాక్కుంటున్న నేతలకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎవరైనా అక్కడ భూములు కొనుగోలు చేసినా, ఆ భూములను మళ్ళీ దళిత, బీసీలు వారి ఆధీనంలోకి తీసుకుంటారన్నారు.
కోట్లు దండుకుంటు.. రైతులకు ఇచ్చేది రూ. 13.50 లక్షలే..
కోట్ల రూపాయలు దండుకుంటూ రైతులకు ఎకరాకు కేవలం రూ. 13.50 లక్షలే ఇస్తున్నారని మాజీ ఎంఎల్ఏ దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూమి విలువలో 30 శాతం డబ్బు ప్రభుత్వానికి కట్టి, మిగతా 70 శాతం డబ్బు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చి మీరు భూములు కొనుగోలు చేస్తే, భవిష్యత్తులో మీరు కట్టిన డబ్బులు మీకు తిరిగి రావన్నారు. ఆ భూమి దళిత, బిసిలకు అప్పగించాల్సి వస్తుందన్నారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆ భూమికి ఎంత రేటు ఉంటుందో అంత రేటు అక్కడ కొన్న వ్యాపారస్తులే అక్కడున్న దళిత, బీసీలకు చెల్లించవలసి వస్తుందన్నారు. చెల్లించకపోతే ఆ భూమిని వారు ఆక్రమించుకుంటారని, వారికి బిఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసులు, వివిధ శాఖల అధికారులు పూర్తిగా అండగా ఉంటారన్నారు.
బెదిరించి భూములు లాక్కున్నారు...
కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల అండతో మమ్ములను బెదిరించి భూములు లాక్కున్నారని భూమి కోల్పోయిన ముల్కల్ల, వేంపల్లి గ్రామాల రైతులు వాపోతున్నారని మాజీ ఎంఎల్ఏ దివాకర్ రావు బాధితులతో కలిసి మాట్లాడారు. విలేకరుల సమావేశంలో వారు సైతం హాజరై వారి బాధను తెలిపేందుకు వచ్చారని, బెదిరించి భూములు తీసుకున్నారు కాబట్టి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారన్నారు. మాకు ఇష్టం లేకున్నా భయంతోనే మేము ఈ భూములు ఇచ్చి డబ్బులు తీసుకున్నామని, భయభ్రాంతులకు గురై ఒప్పుకున్నామని, మాకు న్యాయం చేయాలని కోరుతున్నారని, వారికి మేము అండగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు, పట్టణ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.