24-05-2025 10:52:12 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ సీఐ టీ కరుణాకర్(CI T Karunakar)పై పట్టణానికి చెందిన కొలిపాక రమేష్ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం... రమేష్ తనకు చెందిన భూమిలో (సర్వే నం. 22-13 గుంటలు, సర్వే నం. 23-14 గుంటలు) గోవుల పెంపకం కోసం షెడ్ నిర్మించుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాడు. ఇటీవల వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని షెడ్‌కు మరమ్మతులు చేస్తున్నారు, పంజాల సమ్మయ్య, సరోజన అనే వ్యక్తులు వచ్చి రమేష్ ను తిడుతూ దాడికి ప్రయత్నించారంటూ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు బాధితుని ఫిర్యాదును పట్టించుకోకుండా, ఎలాంటి కేసు నమోదు చేయకుండా రమేష్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి గంటల తరబడి నిలబెట్టడం, సమ్మయ్య కుటుంబంతో రాజీ చేసుకోమని సీఐటీ కరుణాకర్ రమేష్ ను బెదిరించినట్లు తెలిపారు. పైగా, రమేష్ తన హక్కులను ఆధారపరిచే పత్రాలు చూపించినప్పటికీ, సీఐ వాటిని పరిశీలించకుండానే కోర్టు తీర్పులను తేలికగా మాట్లాడారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన తన హక్కులపై దాడిగా భావించిన రమేష్, సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, న్యాయవాది కొత్తూరిరమేష్ పాల్గొన్నారు.