calender_icon.png 17 September, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు కళల్లోనూ రాణించాలి

17-09-2025 05:30:00 PM

జిల్లా స్థాయి "కళోత్సవ్" పోటీల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు వివిధ కళలు, క్రీడల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి "కళోత్సవ్" పోటీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ కళా పోటీలను సంగీతం, నృత్యం, కథ, దృశ్య కళలు వంటి 12 కేటగిరీలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా స్థాయి పోటీలను బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా వివిధ కళలు, ఆటల్లోనూ రాణించాలని అన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇలాంటి పోటీలు ఉత్తమ వేదికగా నిలుస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఇలాంటి పోటీలకు ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

 అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విభిన్న రంగాల్లో రాణించేందుకు జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తున్నదని అన్నారు. అన్ని అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబించేందుకు ఇలాంటి కార్యక్రమాలు వేదికగా ఉంటాయని అన్నారు. మరో తరానికి ఇలాంటి ఆచార సాంప్రదాయాలను వివరించేందుకు మంచి అవకాశమని తెలిపారు. అనంతరం కళోత్సవంలో భాగంగా జిల్లా సైన్స్ మ్యూజియంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన కథలు చెప్పడం, దృశ్య కళల పోటీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.