calender_icon.png 18 July, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ స్వయం ఉపాధి కేంద్ర ప్రారంభం: ఎంపీ మల్లు రవి

17-07-2025 10:25:16 PM

వనపర్తి టౌన్: గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతకు నైపుణ్యాలు అందించేందుకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సమీపంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ను నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి శాసన సభ్యులు మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.  కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ... గ్రామీణ యువతకు నైపుణ్యాలు అందించేందుకు రూరల్ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఈ శిక్షణ సంస్థల పాత్ర కీలకం అని పేర్కొన్నారు.

స్వయం ఉపాధి కోసం వచ్చేవారికి  వేగంగా శిక్షణ కల్పించి ఉపాధి మార్గం చూపించాలని నిర్వాహకులకు సూచించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో యువతకు నైపుణ్యవంతమైన శిక్షణలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది అని తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి వారికి స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు. వనపర్తి లోని మొట్టమొదటి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం నెలకొలుపుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ సహకారంతోనే ఇంత వేగంగా ప్రారంభించినట్లు చెప్పారు.