17-07-2025 10:21:59 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం అంబేద్కర్ భవన్‌లో జరిగిన ప్రత్యేక చెక్కుల పంపిణి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 52 మంది లబ్ధిదారులకు 19,79,000/- రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు, హనుమకొండ మండలానికి చెందిన 202 మంది లబ్ధిదారులకు 2,22,02,432/- రూపాయల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే నిజమైన ఇందిరమ్మ రాజ్యం సాధ్యమవుతుంది. పేద కుటుంబాల్లో కూతుళ్ల పెళ్లిళ్లు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా గౌరవాన్ని కలిగిస్తోంది. ఆపదలో ఉన్న వారికి వైద్య ఖర్చుల భారం తట్టుకునేందుకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇది ప్రభుత్వ మానవతా దృక్పథానికి నిదర్శనం అన్నారు. ఇది పార్టీ పాలన కాదు – ప్రజా పాలన. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మద్దతుగా నిలవడమే మా కర్తవ్యం అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాల ద్వారా సాధికారత కోసం చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని పనిచేసే వారిని గుర్తించి ప్రజలు పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలిపారు.