17-07-2025 10:12:23 PM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులచేత ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి, ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పి సీఈవో పురుషోత్తం, హౌసింగ్ పిడి, మండల పరిషత్ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందించామని, ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారుల చేత ఇందిరమ్మ కమిటీ ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి దశలవారీగా బిల్లులు మంజూరు చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్థికంగా స్తోమత లేని మహిళలకు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్లయితే రుణ సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.