18-11-2025 12:00:00 AM
నిజామాబాద్, నవంబర్ 17 :(విజయ క్రాంతి): జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ఐకెపి ఏ.పీ.ఎంలు, సహకార సంఘాల మండల ఇంచార్జీలు, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసిల్దార్లతో ఒక్కో మండలం వారీగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులను సమీక్షించారు.
ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సేకరించిన వరి ధాన్యం ఎంత, అందులో సన్నాలు ఎన్ని, దొడ్డు రకం ధాన్యం ఎంత పరిమాణంలో సేకరించారు, సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతులకు బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయా అని ఆరా తీశారు. పలు కేంద్రాలలో ఇంకనూ ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభం కాకపోవడం పట్ల కలెక్టర్ సంబంధిత మండల ఇంచార్జీలను కారణాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ జరిపే అవకాశాలు లేనప్పుడు కొనుగోలు కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయించారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు చేయని వారికి వచ్చే సీజన్ నుండి కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయమని స్పష్టం చేశారు. ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయిన చోట చాటింపు వేయించి కేంద్రాలను మూసివేయాలని సూచించారు. కాగా, బిల్లుల చెల్లింపులలో అలసత్వం వహిస్తున్న కేంద్రాల ఇంచార్జీలపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం దించుకునేలా పర్యవేక్షణ జరుపుతూ, వెంటదివెంట ట్రక్ షీట్లు తెప్పించుకుని ఓ.పీ.ఎం.ఎస్ ఎంట్రీలు జరపాలని పదేపదే సూచించినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు.
కొద్దిమంది అలసత్వం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనడం ఎంతమాత్రం సరికాదని, కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించబోమని, రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ఒకవేళ ధాన్యం సకాలంలో అన్ లోడింగ్ చేసుకోకపోతే జిల్లా అధికారుల దృష్టికి తేవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకే ధాన్యం తరలించాలని అన్నారు.
ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ, ఎక్కడ కూడా లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డీఆర్డీఓ సాయాగౌడ్, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్, డీ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, డీ.సీ.ఓ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.