calender_icon.png 10 January, 2026 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

09-01-2026 05:50:00 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారితో కలిసి సందర్శించి వంటశాల, వంట సామాగ్రి నిల్వ గది, మెనూ పట్టిక, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత వివరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పౌష్టిక విలువలతో కూడిన మెనూ అమలు చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాలని తెలిపారు. వంటశాల, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక రూపొందించాలని, సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు.

చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఉదయం వేడి నీరు అందించాలని, ఆహారం తయారీలో నాణ్యమైన నిత్యవసర సరుకులు, తాజా కూరగాయలను వినియోగించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్య బోధన చేయాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శంకరమ్మ, మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.