31-10-2025 08:43:20 PM
 
							బెల్లంపల్లి,(విజయక్రాంతి): నవంబర్ 1 నుండి జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సూచించారు. తాండూర్ మండలంలోని మహేశ్వరి కాటన్స్, శ్రీరామ జిన్నింగ్, ప్రెస్సింగ్ యూనిట్ ను స్థానిక తహసీల్దార్ జోష్ణ తో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందేలా చూడాలన్నారు. రైతుల వద్ద పత్తి కొనుగోలు సక్రమంగా చేయాలని ఆదేశించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో సీసీఐకి పత్తిని విక్రయించేందుకు ప్రారంభించిన కాపాస్ కిసాన్ యాప్ లో ప్రతి రైతు తమ వివరాలు నమోదు చేసుకొని విక్రయాలకు స్లాట్ బుక్కు చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్తిలో తేమ శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రైతులకు అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాలో మాత్రమే చెల్లింపులు జరుగుతాయని స్పష్టం చేశారు. దళారులు కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రాల్లోనికి అనుమతించకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు.