calender_icon.png 4 July, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి..అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు

03-07-2025 12:05:37 AM

-పథకాల ఫలితాలు పేదల గుడిసెల వరకు చేరాలి

-దేశానికి మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 

-ఎనిమిది జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): భూభారతి చట్టం అమలు, పేదల కలలను సాకారం చేసే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి, వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ రెండు పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లు  నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. 

సచివాలయంలోని తన కార్యాలయంలో నిర్మల్, నారాయణపేట్, జోగులాంబ గద్వా ల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ‘ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడితే స్వరాష్ర్టంలో పదేళ్లలో ఎదుర్కొన్న భూ సమస్యలకు విముక్తి లభిస్తుందని, సొంతిం టి కల నెరవేరుతుందని తెలంగాణ ప్రజానీకం నమ్మకంతో అధికారం అప్పగించారు.

వారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు రాష్ర్టంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా భూభారతి చట్టానికి, ఇం దిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టాం’ అని పేర్కొన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. రాష్ర్ట ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దాని ప్రభావం ఇందిరమ్మ ఇండ్లపై పడకుండా ప్రతీ సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేయడానికి వెనుకాడుగు వేయొద్దన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణా నికి అందిస్తున్న 40 మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను లబ్ధిదారులందరికీ చేరేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను  సమర్థవంతంగా ఎదుర్కొని వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీని బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

దేశానికి ఒక మోడల్‌గా ఉండేలా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ర్ట విపత్తు నిర్వహణా సంస్థ (టీజీఎస్‌డీఎంఏ)ను పునర్వ్యవస్థీకరించినట్టు వెల్లడించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పంచాయతీరాజ్ కమిషనర్ సృజన, ఎస్పీడీఎసీఎల్ డైరెక్టర్ ముషారఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.