04-07-2025 09:48:25 PM
సనత్ నగర్,(విజయక్రాంతి): నేడు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ విజయవంతంగా జరిగిందని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే ఇది మొదటిసారి అని వివరించారు.
తెలంగాణలో అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కారణమని ఖర్గే చెప్పారని.. దీంతో కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంత గౌరవం ఇస్తుందో తేలిందన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి దాదాపు 1,000 మంది కార్యకర్తలు ఖర్గే సభకు తరలివెళ్లామని చెప్పారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేసిన సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో మల్లికార్జున్ ఖర్గే చేసిన సూచనలు తూచ తప్పకుండా పాటిస్తామన్నారు.