25-09-2025 08:03:44 PM
పాపన్నపేట,(విజయక్రాంతి): తనవి కానిపై ఆశపడితే మోసపోతారని, సమాజంలో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని మెదక్ డీఎస్పి ప్రసన్నకుమార్ సూచించారు. మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో గురువారం తెల్లవారుజామున కమ్యూనిటీ కనెక్ట్ ద్వారా ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పి మాట్లాడుతూ.. గ్రామాలలో శాంతి భద్రతల కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 100 మంది పోలీసులతో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించామని తెలిపారు.
గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే సరైన పత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసారు. సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుండి గుర్తు తెలియని వ్యక్తులు గంజాయితో పాటు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో యువతను పెడదారి పెట్టిస్తున్నారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బాలికలను ప్రేమ పేరుతో మోసాలు చేసే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.