15-10-2025 12:56:10 AM
పటాన్ చెరు, అక్టోబర్ 14 ః పటాన్ చెరు నియోజకవర్గంలో నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలను అప్ గ్రేడ్ చేస్తూ నూతన మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవా కేంద్రాన్ని మంగళవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ శ్రీదేవితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం మున్సిపల్ సిబ్బందికి ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే తరాలకు మెరుగైన సౌకర్యాలు, అభివృద్ధితో కూడిన పట్టణాలను అందించాలన్న లక్ష్యంతోనే గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేయడం జరిగిందని తెలిపారు. పౌర సేవ కేంద్రాల ద్వారా సమస్యల పరిష్కారానికి సత్వరమే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.
అభివృద్ధికి నిధులు..
పటాన్ చెరు నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం, సమీకృత అభివృద్ధి కోసం నూతనంగా 5 మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ శ్రీదేవి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచా యతీల కంటే మెరుగైన పరిపాలన అభివృద్ధి మున్సిపాలిటీల ద్వారా సాధ్యమవు తుందని తెలిపారు.
ప్రభుత్వం అందించే ప్రతి పైసాకు అకౌంటబిలిటీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పౌర సేవ కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి ఫల్గుణ కుమార్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.