21-05-2025 05:36:10 PM
సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ వక్కవంతుల ప్రభాకర్ రావు..
మునగాల: రాజ్యం, శత్రుదాడులను ఎదుర్కొంటూనే అంతర్గతంగా అనారోగ్య సమస్యలతో ఒక యుద్ధమే చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా విప్లవోద్యమానికి అగ్రభాగాన ఉంచిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ జన్ను సార్(జలగం జనార్ధన్) అని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ వక్కవంతుల ప్రభాకర్ రావు, గ్రామ శాఖ కార్యదర్శి డి రవి అన్నారు. మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జన్ను(జలగం జనార్ధన్) నాలుగో వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ వక్కవంతుల ప్రభాకర్ రావు, గ్రామ శాఖ కార్యదర్శి డి రవిలు మాట్లాడుతూ... జలగం జనార్ధన్ పేద ప్రజల పక్షాన పోరాడి అండదండగా నిలిచిన వ్యక్తి అని అన్నారు. పార్టీ కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ విప్లవోద్యమాన్ని ముందుకు నడిపిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. తను అనారోగ్యంతో బాధపడుతూ విప్లవ ఉద్యమాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విస్తరింప చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వారు జన్ను సార్. అనారోగ్య బాధలను తనలోనే దాచుకొని కార్యకర్తల ఎదుట చాలా చురుకుగా, ముసిముసి నవ్వులతో ఉత్సాహంగా మాట్లాడేవాడు.
గ్రామంలో విప్లవ కమ్యూనిస్టు కార్యకర్తగా చదువు లేని జీతగాళ్లకు రాత్రి బడులు పెట్టి చదువు నేర్పాడు. దీన్ని జీర్ణించుకోలేని భూస్వాములు, పటేళ్లు, పెత్తందారులు జరిపిన అనేక అవమానాలకు, దాడులకు గురయ్యాడు. చివరికి తనకు ఆధారంగా ఉన్న పూరి గుడిసెను సైతం తగలపెట్టారు. ఈ దాడులకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. దానితో శత్రువు అతనిని హతమార్చాలని అనేక కుట్రలు, కుతంత్రాలు కొనసాగిన వీటిని తిప్పి కొట్టడానికి వృత్తి విప్లవకారుడుగా భాగస్వామ్యం కావడం ఒక్కటే మార్గంగా భావించి 1982లో పూర్తి కాలం కార్యకర్తగా విప్లవోద్యమంలో అడుగు పెట్టాడు అని అన్నారు.
విప్లవోద్యమంలోకి అడుగుపెట్టిన జానకి రాములు కు పార్టీ పెట్టిన పేరు జనార్ధన్, ప్రజలు పిలిచే పేరు జెన్ను భాయ్, మేధావులు, విద్యార్థులు జెన్ను సార్ అని పిలిచేవారు అని అన్నారు. కార్యకర్తలకు, క్యాడర్కు ఎంతో ధైర్యాన్ని, చైతన్యాన్ని అందించాడు. 14 సంవత్సరాలు రహస్య జీవితం గడిపి పార్టీ నిర్ణయాలను తూచ తప్పకుండా అమలు చేసేవాడు అని కొనియాడారు. నిజాయితీ, నిబద్ధత, ఉక్కు క్రమశిక్షణకు పెట్టింది పేరు జెన్ను. పార్టీ కోసం కష్టపడి పనిచేసే అనేకమంది పూర్తి కాల కార్యకర్తల భుజం తట్టి నడిపించేవాడు, అందుకే కాబోలు జెన్నుభాయ్ నాయకత్వం వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా, ప్రధానంగా సూర్యాపేట ఉద్యమం ఇంకా సజీవంగా, బలంగా ఉంది అని అన్నారు.
జన్ను సార్ అమరుడై నేటికీ నాలుగేళ్లు గడుస్తున్నా తన జ్ఞాపకాలు, అందించిన చైతన్య పోరాట స్ఫూర్తి నీడలా మమ్మల్ని అంట్టిపెట్టుకుని, తను కలలు కన్నా రాజ్యం కోసం, పీడిత జన విముక్తి కోసం, నిరంతరం మా వెన్నుతట్టి నడిపిస్తూనే, మీ ఆశయాల సాధనకు పునరంకితం అవుతూనే, నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో, మీరందించిన పోరాట స్ఫూర్తితో, విశ్వం ఉన్నంత వరకు ఉద్యమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య, సీనియర్ నాయకులు యల్లావుల సైదులు, గ్రామ నాయకులు దరవత్ సైదా, వీరబోయిన బాలయ్య, వట్టేపు కోటయ్య, పొన్నం బ్రహ్మం, శివ, కోటయ్య, నాగరాజు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామల నవీన్, మాశేటి అంజయ్య, శ్రీరాములు, పివైఎల్ నాయకులు వల్లపుదాసు నరేష్, మేకల కనకరావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.