21-05-2025 11:20:03 PM
భౌతిక కాయం సిద్దిపేట మెడికల్ కళాశాలకు అప్పగింత..
పెంటయ్య మరణం పట్ల సంతాపం ప్రకటించిన మంజీరా రచయితల సంఘం..
సిద్దిపేట: సిద్దిపేటకు చెందిన చిత్రకారుడు, నటుడు, సాహిత్యకారుడు, సామాజికవేత్త, కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యా కేంద్ర లెక్చరర్, ఎస్. పెంటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పెంటయ్య తుది శ్వాస విడిచారు. సిద్దిపేట సువర్ణ వీధికి చెందిన పెంటయ్య విద్యార్థి దశ నుండే సామాజిక ఉద్యమాల పట్ల ఆకర్షితుడై విద్యార్థి సంఘాల్లో పనిచేశాడు. PDSU విద్యార్థి సంఘం నాయకునిగా సిద్ధిపేట ప్రాంతాల్లో ఆయన పనిచేశాడు. సిద్దిపేటలో తన మిత్రులు అలాజ్ పూర్ కిషన్, నరసయ్య, ఉమాపతి రామేశ్వర శర్మ, రామన్న, రామగిరి శివకుమార శర్మ, తదితరులతో కలిసి నవ్య కళానికేతన్ అనే ఒక సాంస్కృతిక సంస్థను సిద్దిపేటలో నెలకొల్పారు.
ఆ సంస్థ ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించే పలు నాటకాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాడు. మంజీరా రచయితల సంఘం మిత్రులతో కలిసి గార్ధ భాండం అనే నాటకలో నటుడిగా పాత్ర నిర్వహించారు. గాయకుడిగా కూడా ఆయన గుర్తింపు పొందాడు. ముఖ్యంగా చిత్రకారుడు చిత్రకారుడిగా కూడా పెంటయ్య ప్రసిద్ధి పొందారు. ఆధునిక భావాలతో చిత్రాలను గీశారు. ప్రవీణ్ ఆర్ట్ గా సిద్దిపేటలో కొంతకాలం కమర్షియల్ ఆర్టిస్టుగా పనిచేసిన ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.శారద కథలు అనే అంశం మీద పరిశోధనాత్మక గ్రంథాన్ని రాసి సాహిత్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. అభ్యుదయ భావాలతో సామాజిక మార్పు కోసం జరిగిన అనేక పోరాటాలతో ఆయన కలిసి నడిచారు.
ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో లెక్చరర్ గా బాధ్యతలు చేపట్టి ఎంతో మంది విద్యార్థులకు ప్రేరణయ్యాడు. సమాజం పై తనదైన ముద్ర వేసిన ఎస్. పెంటయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన స్వగృహంలో ఆయన కన్నుమూశారు.ఆయన గతం లో కోరిన మేరకు మృతదేహాన్ని సిద్దిపేట మెడికల్ కళాశాలకు ఆయన కుటుంబ సభ్యులు అప్పగించారు. ఎస్. పెంటయ్య ఎస్ పెంటయ్య మరణం పట్ల మంజీరా రచయితల సంఘం తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఆయన సమాజం కోసం చేసిన సేవల్ని కొనియాడింది.
పెంటయ్య మరణం సామాజిక ఆలోచనా పరులకు తీరని లోటని మరసం వ్యవస్థాపకులు ప్రముఖ కవి, రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, రచయిత సామాజిక ఉద్యమ కారుడు దారం మల్లారెడ్డి, ప్రముఖ గాయకుడు కవి,ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్, జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కే.అంజయ్య మంజీరా రచయితల సంఘం అధ్యక్షులు కే. రంగాచారి, ప్రధాన కార్యదర్శి సిద్దెంకి యాదగిరి,కవి, రచయిత కందుకూరి శ్రీరాములు, కవి రచయిత అలాజ్ పూర్ కిషన్,అలాజ్ పూర్ శ్రీనివాస్ నందిని భగవాన్ రెడ్డి, తోట అశోక్, పప్పుల రాజిరెడ్డి, పొన్నాల బాలయ్య,తైదల అంజయ్య, బోరెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పెంటయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.