19-07-2025 02:00:27 AM
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో కమల వర్ధనరావు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (పీడీడబ్ల్యూ) యూనిట్లను, నీటి శుద్ధి కర్మాగారాలను తనిఖీ చేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సీఈవో జి. కమల వర్ధనరావు ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆహార భద్రత లో రాజీ పడకూడదు అని సూచించారు.
తనిఖీలు చేసి నమూనాలను సేకరించి, ల్యాబ్‌కు పంపాలని, ఆహార కల్తీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార భద్రత, అమలు, ప్రజా చేరువను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఈవో ప్రశంసించారు. 33 జిల్లాల నుంచి 50 మంది ఆహార భద్రతా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వేగవంతంగా కల్తీలను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్‌ఎస్‌వోలకు రాపి డ్ అనలిటికల్ ఫుడ్ టెస్టింగ్ కిట్లను అందించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ లాబొరేటరీ స్థాపనను వేగవంతం చేయాలని ఆయన కోరారు. నియంత్రణ సమ్మతి విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యేన్ కుమార్ పాండా, డైరెక్టర్ రాకేష్ కుమార్ పాల్గొని ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టం 2006 సమర్థవంతమైన అమలు కోసం వ్యూహాత్మక మార్గదర్శకాలను వివరించారు.