11-08-2025 12:00:00 AM
నూతనకల్ ఆగస్టు 10 : మండల పరిధిలోని పలు గ్రామాలలో ఆదివారం ముత్యాలమ్మకు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సదర్భంగా యడవెల్లి, మాచనపల్లి, చిలపకుంట్ల, ఎర్రపహాడ్, పెదనేమిల, బిక్కుమల్ల గ్రామాలలో మహిళలు ఆదివారం ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్తూ ముత్యాలమ్మకు పసుపు, కుంకుమలు సమర్పించి గ్రామాల ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని తల్లికి నైవేద్యాన్ని సమర్పించారు.
వలిగొండ..
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లికి గ్రామ ప్రజలు ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు మట్టి కుండలలో నైవేద్యం వండుకొని, పసుపు, కుంకుమ, వేప కొమ్మలతో అందంగా అలంకరించి నెత్తిపై పెట్టు కొని కాలువ కట్టమీదగా తరలివెళ్లి చెరువు పక్కన గల ముత్యాలమ్మ తల్లికి బోనాల సమర్పిం చారు. ఈ సందర్భంగా తమ కోరిన కోరికలను నెరవేర్చాలంటూ మొక్కులు తీర్చుకున్నారు.
నేరేడుచర్ల
నేరేడుచర్ల, ఆగస్టు 10 : పట్టణంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి పండుగ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత నేరేడుచర్ల, శివాజీ నగర్, నరసయ్య గూడెం, రామాపురం గ్రామాలలో గల ముత్యాలమ్మ, బంగారు మైసమ్మ,దాళం బాలమ్మ, కోట మైసమ్మ లతో పాటు బొడ్రాయిల వద్దకి మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకోగా డప్పు, వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ దేవాలయాలకు వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ముక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.