18-12-2025 02:01:37 AM
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి
నిజామాబాద్, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో బలంగా నిలిచిందని, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని అమృత గార్డెన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన ఏడు మండలాల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచులు, వార్డు మెంబర్లను ఎమ్మెల్యే అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో 153 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా, వాటిలో 120 గ్రామాల్లో 75 %శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీకి కేవలం 20 సీట్లు మాత్రమే దక్కాయని, బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయని పేర్కొన్నారు.
మిగతా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా పోరాడి స్వల్ప తేడాతో ఓటమి చెందారని వివరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, అదే కారణంగా ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 80 శాతం వరకు నమోదైందని తెలిపారు. ప్రజా సంక్షేమం పట్ల ఆసక్తి లేని బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేదని విమర్శించారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల వద్దకు నేరుగా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు మరింత మద్దతు తెలుపుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, ఐసీడీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు అమృతాపూర్ గంగాధర్, మాజీ ధర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ పొలాసాని, మాజీ డిచ్పల్లి ఎంపీపీ కంచెట్టి గంగాధర్, డీసీసీ కార్యదర్శి ధర్మ గౌడ్, గుడి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.