calender_icon.png 9 December, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది

09-12-2025 02:38:44 AM

  1. భవిష్యత్తులో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు జరపాలి లేదంటే రాష్ట్రంలో యుద్ధమే

తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్. కృష్ణయ్య

తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కంచిగారి ప్రవీణ్ కుమార్

ముషీరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించి బీసీలను నమ్మించి మోసం చేసిందని తెలంగాణ బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కంచిగారి ప్రవీణ్ కుమార్ ను ఎంపీ ఆర్. కృష్ణయ్య నియమించి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ చట్టబద్ధంగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ అధ్యక్షులు పదేపదే ప్రకటించి ఏడాది కాలంగా బీసీలను నమ్మిం చి మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం మొదటి నుంచే వివిధ పార్టీల మద్దతు ద్వారా పోరాడితే సాధించే అవకాశం ఉన్నా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం లేదన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వం వహించే ఇండియా కూటమికి లోకసభలో 240 మంది ఎంపీలు ఉన్నా ఒక్కరోజు పార్లమెంటులో ప్రశ్నించలేదన్నారు. అలాగే ప్రధాన మంత్రితో కలిసి చర్చించలేదని అన్నారు.

ఇప్పటికైనా ఎన్నికలను ఆపి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధమే కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కంచి గారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

అదేవిధంగా 42% రిజర్వేషన్ల అమలు అయ్యేంత వరకు పోరాటం చేస్తానని అన్నారు. తన నియామకానికి కృషి చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రిషి అరుణ్ బాబు, బీసీ మిత్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు భరత్ గౌడ్, టి. రాజ్ కుమార్ చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.