09-12-2025 02:06:28 AM
* పార్టీల గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వకపోతే.. కాంగ్రెస్ పార్టీ చాలా డ్యామేజ్ అవుతుందనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో నిధుల పేరుతో తప్పించుకున్నా.. భవిష్యత్‌లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉండదని చెబుతున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి) : తెలంగాణలో ఒకవైపు పంచా యతీ ఎన్నికలు.. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పోరాటం.. రెండూ కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతూనే ఉన్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో.. ప్రతిపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘా లు, ఇతర ప్రజాసంఘాలు అధికార పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. పం చాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను బీసీలకిచ్చిన రిజర్వేషన్ల అమలు హామీ పై స్థానికంగా ఉండే బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం అమలుచేయ డం లేదంటూ మూడురోజుల క్రితం సాయి ఈశ్వరాచారి అత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా అధికార కాంగ్రెస్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బీసీ నినాదం ముందు సర్కా ర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కూడా కొట్టుకుపోతున్నాయనే అధికార పార్టీ నాయకుల్లోనే చర్చ జరుగు తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లిన తర్వాత..
ఎన్నికలకు వెళితే బాగుండేదనే అభిప్రా యం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. అంతే కాకుండా బీసీ రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని రాహుల్‌గాంధీ ద్వారా లోక్‌సభలో ప్రైవేట్ బిల్లును తెచ్చి ఉంటే.. అప్పుడు కేంద్రం కోర్టులోకి బీసీ బిల్లు వెళ్లేదని, తద్వారా కాంగ్రెస్‌కు కొంతమేర ఉపశమనం కలిగేదని వాదన కూడా వినిపిస్తోంది.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ వేసి.. కులగణన చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. రిజర్వేషన్ల పరిమితి 50% దాటవద్దని న్యాయస్థానాలు తేల్చి చెప్పడంతో.. పాత రిజర్వేషన్లతో సర్కార్ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నది. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా క్షేత్ర స్థాయిలోకి వెళుతున్న అధికార పార్టీ నాయకులను బీసీ రిజర్వేషన్లపై ప్రశ్నిస్తున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు వెళ్లాలని బీసీ సంఘాల నాయకులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. అయితే గ్రామాల్లో పాలవర్గం లేకపో వడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు దాదాపు రూ. 3 వేల కోట్ల వరకు నిలిచిపోయాయని, మార్చిలోపు గ్రామాలకు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెనక్కిపోతాయని, అందుకే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది.
డ్యామేజ్ మాటేమిటి..?
పార్టీల గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీ సీ, మున్సిపాలిటి, కార్పోరేషన్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వకపోతే.. కాంగ్రెస్ పార్టీ చాలా డ్యామేజ్ అవుతుందనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో నిధుల పేరుతో తప్పించుకు న్నా.. భవిష్యత్‌లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉండదని చెబుతున్నారు.50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే చేయాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం సహకరించ కుంటే.. మళ్లీ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బీసీ సంఘాలు మాత్రం చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు కావాలని..? పార్టీ పరంగా ఇస్తామంటే ఒప్పుకునేది లేదని తేగేసి చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యిగా మారిందని, ఈ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకరించకుంటే కాంగ్రెస్ తెలంగాణలో మరోసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందనే చర్చ బలంగా జరుగుతోంది.