calender_icon.png 9 December, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీలో 300 వార్డులు

09-12-2025 02:37:23 AM

  1. ఖరారు చేస్తూ జీవో జారీ

రెట్టింపైన వార్డుల సంఖ్య

ఎన్నికల నగారాకు మార్గం సుగమం

త్వరలోనే వార్డుల డీలిమిటేషన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 8 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండబోయే వార్డుల సంఖ్యపై నెలకొన్న సస్పెన్షన్‌కు తెరదించింది. ఇప్పటివరకు ఉన్న 150 వార్డుల సంఖ్యను ఏకంగా 300కు పెంచుతూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు జీవో ఎంఎస్ 266ను విడుదల చేశారు.

దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రధాన అడ్డంకి తొలగిన ట్లయింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విలీనంతో నగరం ‘తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్’గా విస్తరించింది. ఈ నేపథ్యంలో పాలనా సౌలభ్యం కోసం వార్డుల సంఖ్యను ఎంతకు పెంచాలనే దానిపై  సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్  సమగ్ర అధ్యయనం చేసింది.

27 అర్బన్ లోకల్ బాడీల విలీన సందర్భంలో వార్డుల పునర్వ్యవస్థీకరణ ముసా యిదా పేరుతో సీజీజీ ఇచ్చిన నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించారు. దీనిని క్షుణ్ణం గా పరిశీలించిన ప్రభుత్వం.. కమిషనర్ ప్రతిపాదన మేరకు వార్డుల సంఖ్యను 300గా ఖరారు చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు శరవేగంగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. వార్డుల సంఖ్య ఖరారు కావడంతో ఇక క్షేత్రస్థాయిలో భౌగోళిక సరిహద్దుల విభజన మొదలుకానుంది. ప్రతి 40 వేల జనాభాకు ఒక వార్డు చొప్పున 300 వార్డులను విభజించనున్నారు.