calender_icon.png 9 December, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రోదనలు.. వేదనలే!

09-12-2025 01:54:18 AM

  1. కాంగ్రెస్ జరుపుకోవాల్సింది.. అపజయోత్సవాలు 
  2. గ్లోబల్ సమ్మిట్ పేరును గోబెల్స్ సమ్మిట్‌గా పెట్టుకుంటే బాగుండేది 
  3. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు
  4. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్  
  5. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై చార్జీషీట్ విడుదల చేసిన బీఆర్‌ఎస్ పార్టీ

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి) : కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు కడగండ్లు, వేదనలు, రోదనలు, రెండేళ్ల మొండి చెయ్యే.. మిగిలిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని అపజయోత్సవాలని ఆయన సూచించారు. గ్లోబల్ సమ్మిట్ పేరును గోబెల్స్ సమ్మి ట్‌గా పెట్టుకుంటే బాగుండేదని, దావోస్ పెట్టుబడుల్లో డొల్ల కంపెనీల పెట్టుబడులే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

ఫ్యూచర్ సిటీలో కూడా ఫేక్ పెట్టుబడులతో జనాలను భ్రమింప చేస్తున్నారని హరీశ్‌రావు  విమర్శించారు. ఒక ప్రభు త్వానికి మొదటి రేండేళ్ల సమయం అత్యంత కీలకమని, ప్రభుత్వ విజన్, విధానం, అభివృద్ధి, సం క్షేమంపై ఉన్న శ్రద్ధ ఏంటో తేగతెల్లం అవతోందన్నారు. రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలన చూస్తుంటే మూడే మూడు మాటలని, నిస్సారం, నిష్ఫలం, నిరర్థకమని విమ్శించారు.

రెండేళ్ల కాంగ్రెస్ పా లన వైఫల్యాలపై బీఆర్‌ఎస్ పార్టీ సోమవారం తెలంగాణ భవన్‌లో చార్జీషీట్ విడుదల చేసిం ది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజా భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని, ప్రతి రోజూ ప్రజలను కలిసి సమస్యలు వింటానని చెప్పిన రేవంత్‌రెడ్డి .. ఒక్క రోజు బాగోతంగానే ప్రజాదర్బార్  మారిందని మండిపడ్డారు.

అభివృద్ధి దారితప్పింది.. సంక్షేమం సన్నగిల్లింది..   

 రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో  అభివృద్ధి దారితప్పి..  సంక్షేమం సన్నగిల్లిందని హరీశ్‌రావు విమర్శించారు.  హామీల అమలు గాలికొదిలి అబద్ధాలు అబండాతోనే సీఎం రేవంత్‌రెడ్డి కాలం వెల్లదీస్తున్నారన్నారు. ప్రజాసంపాదనను కొల్లగొట్టి తమ సొంత సంపాదనపై, సీఎం, మంత్రులు దృష్టి సారించారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని అసెంబ్లీలో మొదటి రోజు చెప్పిన హామీ అమలులో అట్టర్ ప్లాప్ అయ్యారని తెలిపారు. హై డ్రా పేరుతో కూల్చి వేతల అరాచాకం, ఏయిర్‌పోర్టు,  ఫార్మాసిటీ, మెట్రో రద్దు అని హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడ్డాడని హరీశ్‌రావు విమర్శించారు.

కాంగ్రెస్ అంటేనే కరప్షన్.. 

కాంగ్రెస్ అంటేనే కరప్షన్.. కరప్షన్ అంటేనే కాంగ్రెస్ అని హరీశ్‌రావు విమర్శించారు. కలిసి దోచుకుందాం.. కలిసి పంచుకుందాం.. రాష్ట్రా న్ని నంజుకు తిందాం’ అనే పాలసీని  రాష్ట్రంలో ఈ రెండేళ్లలో విజయవంతంగా అమలవుతోందని అన్నారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా రకరకాలు టాక్స్‌లతో తమ జేబులు నింపుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హ యాంలో భవన నిర్మాణాలకు ఆన్‌లైన్ పద్ధతిలో పూర్తి పారదర్శకంగా అనుమతిలిస్తే.. ఇ ప్పుడు స్కయర్ ఫీట్‌కు ఇంత అని ఫిక్స్ టాక్స్ కడితే కానీ అనుమతులు రావడం లేదన్నారు. 

 రాష్ట్రంలో ఆర్ ఆర్ టాక్స్, భట్టి, ఉత్తమ్, పొంగులేటి టాక్స్‌తో పాటు ఎనుములు బ్రదర్స్ టాక్స్ ఇలా ఎవరు పడితే వాళ్లు దోచుకుంపటన్నారని ఆరోపించారు. క్యాబినెట్ సమావేశంలోనే దో చుకోవడంపై చర్చించుకుంటున్నారని, దోచుకున్న దాంట్లో కొంత ఢిల్లీకి కప్పం కడుతున్నా రని, అందుకు కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తోందని ఆరోపించారు. వివిధ స్కాంమ్‌లు, పాలసీలకు పాల్పడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.

కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేశారు..  

గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు (ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర పథ కాలు)  కేసీఆర్ అమలు చేశారని, రేవంత్‌రెడ్డి మాత్రం వ్యక్తిగత ద్వేషంతో కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు నిలిపివేసి, పేద ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ అనవాళ్లు , చరిత్రను చెరిపివేయాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

రేవంత్‌రెడ్డివన్నీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలే.. 

రేవంత్‌రెడ్డి తన ఇంటిపేరునే బ్లాక్‌మెయిల్‌గా మార్చుకున్నారని హరీశ్‌రావు దుయ్యబ ట్టారు. కుదిరితే క్యాష్ బ్యాగులు క్వారీ చేయడం, లేదంటే బ్లాక్ మెయిల్‌తో భయపెట్టడం రేవంత్‌రెడ్డి మెయిన్ దందా. సీఎం అయ్యాక కూడా దాన్నే కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. నిరుద్యోగుల బాధలు చెప్పాలంటే రాస్తే రామాయణమంత, చెబితే భారతమంతా ఉంటుందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఐదారువేలే ఇచ్చారని, 61 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని, ఆటో డ్రైవర్ల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

ప్రజాభవన్ వైపు మంత్రులు కూడా చూడటం లేదు

ప్రగతి భవన్ ముందున్న ఇనుప గ్రిల్స్‌ను తీసేసి.. ఏదో సంకెళ్లు తెంపినట్లు షో చేసిన రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌కు సామన్య ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చని గప్పాలు కొట్టిన బిల్డప్ బాబాయ్ రేవంత్‌రెడ్డి చెప్పిన మొదటి అబద్ధమని హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పుడు కనీసం మంత్రులు కూడా ప్రజాదర్భార్ వైపు చూడటం లేదని, ప్రజా దర్బార్ పక్కనే ఉండే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఫిర్యాదులపై ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ప్రజా భవన్ ఇప్పుడు కాంగ్రెస్ నేతల జల్సాలు, విందులు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని హరీష్‌రావు దుయ్యబట్టారు. ఢిల్లీ బాస్‌లకు గెస్ట్‌హౌస్‌గా మారిందని ఆరోపించారు. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, చరిత్ర నుదిటి మీద కాలం చేసిన సంతకం కేసీఆర్ అని పేర్కొన్నారు.