calender_icon.png 9 December, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా గ్లోబల్ సమ్మిట్

09-12-2025 01:49:15 AM

తొలి రోజే 1.88 లక్షల కోట్లు

* తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్‌ను ప్రారంభించారు.సమ్మిట్‌కు వస్తున్న అతిథులకు రోబో స్వాగతం పలుకుతూ సందడి చేసింది.

  1. హాజరైన వేలాది మంది దేశ, విదేశీ ప్రతినిధులు
  2. ఆకట్టుకున్న తెలంగాణ రైజింగ్ థీమ్ సాంగ్
  3. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హ్యూమన్ రోబో

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట అనుకూలతలను మరోసారి ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతి నిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వివిధ అంశాలపై ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రైజింగ్ థీమ్‌పై ప్రభుత్వం రూపొందించిన సరికొత్త పాటను ఆవిష్కరించారు.

గ్లోబల్ సమ్మింట్ వేదికగా ఈ పాటను ప్రదర్శించారు. ‘తెలంగాణ రైజింగ్..స్టేట్ ఈజ్ సో షైనింగ్.. ద ఫ్యూచర్ ఈజ్ బిల్డింగ్..’ అంటూ సాగే ఈ పాటలో తెలంగాణ టూరిజం, పరిశ్రలు, భారత్ ఫ్యూచర్ సిటీ, గేట్ వే ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ అంశాలను పొందుపరిచారు. తెలంగాణలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని, వచ్చి పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చారు.

ప్రతాప్ రానా ఈ థీమ్ సాంగ్‌ను రచించి దర్శకత్వం వహించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025’ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ‘ఫ్యూచర్ సిటీ’లో జరుగుతోంది. ఫ్యూచర్ సిటీలోని 100 ఎకరాల్లో సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సమావేశ ప్రాంగణాలు, చర్చా వేదికలు, వాహనాల పార్కింగ్‌లు, అతిథులు విశ్రాంతి తీసుకునేందుకు సైతం సకల వసతులతో ఏర్పాట్లు చేశారు. పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు తెలంగాణ రాష్ర్ట ఘనతను ప్రపంచానికి చా టి చెప్పేలా సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. భారీ భద్రత నడుమ.. మొత్తంగా చరిత్రలో నిలిచిపోయేలా అదిరిపోయే రీతిలో అధికారులు ఏర్పాట్లుచేశారు.

ఆకట్టుకున్న రోజో.. 

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్‌ను ప్రారంభించారు. అయితే, సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమ్మిట్‌కు వస్తున్న అతిథులకు రోబో స్వాగ తం పలుకుతూ సందడి చేసింది. సదస్సుకు వచ్చిన ప్రతినిధులు రోబోతో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు రోబో వారిని హలో అంటూ పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇంస్తోంది. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను వారికి వివరిస్తూ ఉంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆ రోబో హాయ్ చెప్పి ఆందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సమ్మిట్‌కు దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 2047 నాటికి రాష్ట్రాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చాలన్న విజన్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అత్యంత ఆధునిక హంగులతో కూడిన వేదికలు, డిజిటల్ టన్నెళ్లు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు అతిథులకు స్వాగతం పలుకుతున్నాయి..

రాష్ర్టంలోని అపారమైన అవకాశాలను వివరించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను సాధించడమే ప్రధాన అజెండాగా ఈ సమిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 ప్రతినిధులు, మొత్తంగా దాదాపు మూడు వేల మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.