09-12-2025 01:04:28 AM
ముషీరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాం తి): తనతో పెళ్లికి ఒప్పుకోవడం లేదనే కోపం తో యువతి గొంతుకోసి, హత్య చేసిన ఘటన సోమవారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్‌లో జరిగింది. ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన లక్ష్మి, కాంతారావు దంపతులు బాపూజీ నగర్‌లో నివాస ముంటున్నారు. వారి కూతురు పవిత్ర (19) ఇంటర్ పూర్తి చేసి, ఇంట్లోనే ఉంటుంది. పవిత్ర మేనబావ అయిన హైదరాబాద్ రహమత్ నగర్‌కు చెందిన ఉమా శంకర్ (25) టైల్స్ పనిచేస్తున్నాడు.
గత కొన్ని రోజుల నుంచి పవిత్ర తో పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులను అడుగుతున్నాడు. ఇదే విషయమై సోమవారం మధ్యాహ్నం పవిత్ర ఇంటికి వెళ్లిన ఉమాశంకర్ ఆమెతో గొడవ పడ్డాడు. ఉమా శంకర్ ప్రవర్తన తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో వారి ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
ఇంతలోనే పవిత్ర తల్లి చూస్తుండగానే కత్తితో పవిత్ర గొంతు కోశాడు. ఈ ఘటనలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందింది. ఉమాశంకర్ తన సెల్ ఫోన్‌ను, కత్తిని ఘటన స్థలం లోనే వదిలి పారిపోయాడు. ఆ రెండిటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెళ్లికి నిరాక రించిందని కోపంతోనే పవిత్రను ఉమాశంకర్ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
పవిత్ర పేరెంట్సే చేరదీశారు
ఈ ఘటనకు సంబంధించి పవిత్ర మేనత్త షాకింగ్ నిజాలు వెల్లడించింది. ఉమాశంకర్ తల్లిదండ్రులు చనిపోతే పవిత్ర తండ్రే చేరదీశాడని చెప్పింది. పవిత్ర, ఉమాశంకర్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని తెలిపింది. కానీ ఉమాశంకర్‌కు పవిత్రపై అనుమానంతో ఆమెను ఎక్కడకీ వెళ్లనివ్చేవాడు కాదని, ఇంటర్‌లోనే చదువుమా న్పించాడని తెలిపింది. కొన్ని రోజుల క్రితం పవిత్ర తల్లిదండ్రులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లిందని, వెళ్లొద్దని ఉమాశంకర్ చెప్పినా గుడికి వెళ్లిందనే కోపంతో వచ్చి గొడవకు దిగాడని చెప్పింది. దీంతో ఉమాశంకర్‌ను పెళ్లి చేసుకోను అని పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో హత్య చేశాడని చెప్పింది.