02-01-2026 06:20:58 PM
హనుమకొండ,(విజయక్రాంతి): దోచుకోవడం దాచుకోవడంలో రెండు పార్టీలు ఒక్కటే అని, ఆనాడు టిఆర్ఎస్ పార్టీ దోచుకుని దాచుకుంటే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తుందని బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం హన్మకొండ హంటర్ రోడ్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ... గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో గెలుపొందిన సర్పంచ్లందరూ బీఆర్ఎస్ పార్టీ వారేనని, ఇప్పుడు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులందరూ కాంగ్రెస్ పార్టీ వారే అని అప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారన్నారు.
కానీ వాస్తవంగా గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నది శూన్యం అని, గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు మరియు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వార జరుగుతుంది అని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమిషన్ల పై తప్పితే అభివృద్ధిపై ఎటువంటి ఆలోచన లేదు అని, కేవలం ప్రజల ముందు రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటే అని వీరిద్దరిని కలుపుతున్నది రాహుల్ గాంధీ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్లు, కమిషన్లు, కాంట్రాక్టులు అని తెలియజేశారు.