08-10-2025 12:15:21 AM
మూడు నెలలుగా ప్రియుడి ఇంటి వద్దే ప్రియురాలు
పెళ్లికి అంగీకరించిన ఇరు కుటుంబాలు
పలు కారణాలతో వాయిదాపడుతున్న వివాహం
ఈ విషయమై ఇరువురి మధ్య గొడవలు?
జనగామ జిల్లా తాటికొండలో ఘటన
మహబూబాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో సోమవారం ఓ ప్రేమజంట గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మంగళవారం ప్రియుడు మృతిచెందాడు.
ప్రియురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తాటికొండ గ్రామానికి చెందిన మారపాక అన్వేష్ (26), హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన గడ్డం పావని(22) మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిరువురు పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకొని పావనిని అన్వేష్ తన ఇంటికి మూడు నెలల క్రితం తీసుకువచ్చాడు.
పావని తల్లిదండ్రులు నిరుపేదలు కావడం, పెళ్లి ఖర్చులు భరించే పరిస్థితి లేకపోవడంతో అబ్బాయి తల్లిదండ్రులే వివాహాన్ని జరిపించడానికి అంగీకరించారు. ఈ క్రమంలో అన్వేష్ సమీప బంధువు మరణించడం, ఆ తరువాత వినాయక చవితి పండగ కారణంగా వీరి వివాహం వాయిదా పడుతోంది. ఇలా వీరి వివాహానికి ఏదో ఒక కారణం అడ్డుగా మారడంతో ఇద్దరి మధ్య గత వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన అన్వేష్ తల్లి.. బంధువుల సాయంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అన్వేష్ మరణించగా, పావని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.