24-07-2025 01:03:06 AM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ’పీఎం కుసుమ్’ ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందించడంలో కాంగ్రె స్ సర్కారు ఘోరంగా వైఫల్యం చెందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శిం చారు. వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, రైతులపై విద్యుత్ భారం పడకుండా కేంద్రం ‘పీఎం- కుసుమ్’ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ‘పీఎం- కుసుమ్’కు ప్రోత్సాహాన్ని అందిస్తున్నప్పటికీ.. ఈ పథకాన్ని తెలంగాణ లో అమలు చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఎక్స్ ద్వారా ఆరోపించారు. ఈ పథకం 2026లో ముగియనున్నందున, కనీసం ఇప్పటికైనా సీఎం చొరవ తీసుకుని రైతులకు పథకం ప్రయోజనాలను అందజేయాలని కోరారు.
‘పీఎం- కుసుమ్’ పథకంలో భాగంగా తెలంగాణకు సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యాన్ని ఆమోదించి, 20వేల సోలార్ అగ్రికల్చర్ పంప్‌సెట్లను కేటాయించినందుకు కేంద్ర రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.