25-07-2025 02:45:08 AM
షేక్‌పేట కార్యాలయం ఎదుట బజరంగ్‌దళ్ ధర్నా
అరెస్టు, బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలింపు
కాలనీవాసుల కంటతడి
మందిరం నిర్మించి తీరుతాం: వీహెచ్‌పీ
సంఘటనా స్థలానికి బీజేపీ నాయకురాలు మాధవిలత
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ తల్లి మందిరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసింది. గురువారం షేక్‌పేట ఎమ్మార్వో అనితరెడ్డి వర్షంలో గొడుగు పట్టుకుని, సిబ్బందితో ధ్వంసం చేయించారు. వీరికి మద్దతుగా పోలీసు సిబ్బంది, ఏసీపీ దగ్గరుండి విగ్రహాన్ని కూల్చారు. బోనాలు ముగిసిన మరుసటిరోజే మంగళవారం రాత్రి ప్రహరీ, గుడి పైకప్పును అధికారులు కూల్చివేశారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బజరంగ్‌దళ్ ఆందోళనకు దిగింది. ఈ కారణంగా వెనక్కి తగ్గినట్టు నటించిన రెవెన్యూ అధికారులు మందిరాన్ని.. గురువారం మందిరాన్ని కూల్చివేశారు. దీంతో గురువారం ఉదయం కాలనీవాసులు, బజరంగ్‌దళ్ కార్యకర్తలు షేక్‌పేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పురాతన ఆలయమని, తరతరాలుగా పూజలు చేస్తున్న మందిరాన్ని కూల్చవద్దని శాంతియుతంగా ఆందోళన చేపట్టారు.
తన పరిధిలో లేదని, కలెక్టర్‌ను కలవాలని ఎమ్మార్వో, సిబ్బంది తప్పించుకున్నారు. బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఎమ్మార్వో కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోపు జోరుగా కురుస్తున్న వర్షంలోనే ఎమ్మార్వో.. తన సిబ్బందితో కలిసి, పోలీసుల సహకారంతో మందిరాన్ని కూల్చివేయించారు. కలెక్టర్‌ను కలుద్దాం అనుకున్న బజరంగ్‌దళ్ కార్యకర్తలకు కలెక్టర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.
ఇంతలో మందిరం కూల్చుతున్నారని తెలిసి అక్కడకు వెళ్లారు. భక్తులు బోరున ఏడుస్తున్నప్పటికీ ఎమ్మార్వో పట్టించుకోలేదు. అటువైపు వచ్చిన బజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదే విషయమై వెస్ట్ జోన్ డీసీపీతో మాట్లాడితే తప్పుడు సమాచారం ఇచ్చారు. మందిరం కూల్చడం లేదని, మందిరం దగ్గర ఉన్న శిథిలాలు తొలగిస్తున్నామని చెప్పారు. కానీ ప్రతిష్టించిన మందిరాన్ని కూడా తొలగించడం బాధాకరం.
రజాకార్ల పరిపాలన
రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతున్నదని.. హిందువులకు భరోసా, భద్రత కరు వైందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాంను మించిన హిందూ వ్యతిరేక పాలన కొనసాగుతోందని ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనికంతటికి మూల కారణమైన షేక్ పేట ఎమ్మార్వో ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కూల్చిన చోటే మందిరాన్ని పునర్మించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హిందూ సమాజమంతా ఒక్కటై ఆందోళన చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనో భావాలను గౌరవించాలని, మందిరాన్ని ని ర్మించాలని డిమాండ్ చేశారు. మందిరం కో సం ధర్నా చేస్తున్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకుల ను అరెస్టు చేశారు.
వారిలో సుభాష్ చందర్, మహేష్ యాదవ్, హర్షవర్ధన్, సత్యనారాయణ, కుమార్ యాదవ్, కిరణ్, మధు, రాజు, జైరామ్, ప్రవీణ్, అఖిల్, శివదేవ హర్ష ఉన్నారు. బీజేపీ నాయకురాలు మాధవిలత సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అధికారుల తీరును తప్పుపట్టారు. మందిరం కూల్చివేత అక్రమమని ఆరోపించారు. దీంతో ఆమెను కూడా పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.