06-08-2025 06:23:38 PM
జర్నలిస్ట్ బస్సు పాసులు తెలంగాణ మొత్తం పని చేసేలా ఇవ్వాలి..
బిఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకుడు భూక్య జంపన్న..
ములుగు (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న(BRS District Leader Bhukya Jampanna) డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, పత్రికా రంగం ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంబమని, పల్లెల్లో, పట్టణాల్లో, ఎండలో, వర్షంలోనూ కష్టపడే జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం విస్మరించకూడదని అన్నారు. ప్రస్తుతం జర్నలిస్టులకు వారి సొంత జిల్లాల వరకే బస్సు పాస్ పనిచేసేలా ఇస్తున్నారు. అలా కాకుండా తెలంగాణలో ఎక్కడికైనా ప్రయాణం చేసే వీలుగా ఏ బస్సులోనైనా చెల్లుబాటు అయ్యే విధంగా బస్సు పాస్ ఇవ్వాలి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు జర్నలిస్టులకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య బీమా, హౌసింగ్ సౌకర్యం, ప్రెస్ అక్రిడిటేషన్ సౌకర్యాల విస్తరణ వంటి వాగ్దానాలు చేసిన విషయాన్ని జంపన్న గుర్తుచేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీల అమలుపై ఎటువంటి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు."జర్నలిస్టుల కోసం వాగ్దానం చేసిన ప్రతి పథకాన్ని వెంటనే ప్రారంభించాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పత్రికా ప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం" అని జంపన్న హెచ్చరించారు.