06-08-2025 06:16:41 PM
పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిదని ఫూలే ఆశయ సాధన సమితి(పాస్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్(President Dr. Sangani Malleshwar) కొనియాడారు. బుధవారం పాస్ ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 91వ జన్మదినం సందర్బంగా కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్స్ లోని జయశంకర్ విగ్రహానికి పాస్ సభ్యులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి జయశంకర్ సార్ ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారని అయన సేవలను గుర్తుచేశారు.
తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ఆచార్య జయశంకర్ సేవను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా, వారి సంకల్పబలం రాష్ట్రసాధనకు చేసిన నిర్విరామ కృషి మరువలేనిదని, నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో చైతన్యం చేయడం వల్లనే రాష్ట్రసాధనకు ఆయువుపట్టు అయ్యారన్నారు. అయన ఆశించినట్టే రాజకీయ ప్రకియతోనే తెలంగాణ వచ్చింది కానీ, దశాబ్ద కాలంలో కొన్ని వర్గాలకు మాత్రం ఫలాలు అందినాయని, సారూ స్పూర్తితో సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం చేయడం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య, ఉమ్మడి జిల్లా కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, పాస్ జిల్లా నాయకులు డాక్టర్ స్వర్ణలత, మెరుగు బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.