calender_icon.png 13 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాల, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా

13-09-2025 12:03:12 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హసన్ పర్తి లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులను ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ సహకారంతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాల పూర్వ విద్యార్థి, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ సహకారంతో మహర్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వివిధ సంస్థల భాగస్వామ్యంతో రూ.42 లక్షల వ్యయంతో గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం ఏర్పాటు చేయగా వీటిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, పాఠశాల పూర్వ విద్యార్థి, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్, దాతలు హాజరై ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు మాట్లాడుతూ ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐపీఎస్ సాధించి, తాను చదువుకున్న పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతుల కల్పనకు, అభివృద్ధికి కృషి చేస్తున్న చెన్నూరి రూపేష్ కు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాల తో పాటు జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, రీడింగ్ రూమ్, కిచెన్, ఆడిటోరియంను దాతల సహకారంతో  విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ చదువుకుంటేనే జీవితాలు మెరుగుపడతాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివిన వారేనని పేర్కొన్నారు. 

పాఠశాల పూర్వ విద్యార్థి, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ చదువుతోనే తాను ఐపీఎస్ ని సాధించానని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాదని ప్రతి ఒక్కరూ సంకల్పంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు.  చదువుతోనే గొప్ప వ్యక్తులుగా సమాజంలో నిలబడతారని సూచించారు. తాను ఈ స్థాయిలో నిలబడడానికి తోడ్పాటు అందించిన పాఠశాలకు తనవంతు సహాయాన్ని అందించాలనే సంకల్పంతో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులకు రూ. 60వేల నగదు ప్రోత్సాహకాన్ని స్వాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ అరుణ అందజేశారు. పాఠశాలలు, కళాశాలలో వసతులు, అభివృద్ధికి సహకారం అందించిన  దాతలు సత్యనారాయణ, అరుణ, బ్లోచీవ్ టెక్నాలజీ సీఈవో ఉదయ్, ఇతర దాతలను ఘనంగా శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు.