13-09-2025 12:50:06 AM
-భవన నిర్మాణ అనుమతులు వేగంగా మంజూరు చేయాలి
-జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
-టౌన్ ప్లానింగ్ పనితీరుపై కమిషనర్ సమీక్ష
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులను వేగంగా మంజూరు చేయాలని, టౌన్ ప్లానింగ్ అధికారులు మరింత మెరుగ్గా పని చేయాలని జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు. జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్‌తో కలిసి టౌన్ ప్లానింగ్ విభాగం కార్యకలాపాలను జోనల్, సర్కిల్ వారీగా సమీక్షించిన సందర్భంగా ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.భవన అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఓసీలు, కోర్టు కేసులు, ప్రజా ఫిర్యాదులు, లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కమిషన ర్ అధికారులను ఆదేశించారు.
అనుమతులలో జాప్యం లేకుండా పారదర్శకత తో వ్యవహరించాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.నగరంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఏ విధమైన ప్రమాదం సంభవించకముందే వాటిపై చర్యలు చేపట్టాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరు బాగుందని అభినందించిన కమిషనర్, పారదర్శకతతో మరింత బాగా పని చేసి, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, అదనపు సీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.