18-07-2025 12:00:00 AM
మండల స్థాయి సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు
సిద్దిపేట క్రైమ్, జూలై 17 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఆ పార్టీ సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో అర్బన్ మండల ముఖ్యనాయకుల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, 19 నెలల కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు.
స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు హయాంలో దేశ, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు సాధించి సిద్దిపేట దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆచరణలో అమలుకాని హామీలనిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలని చెప్పిన కాంగ్రెస్... ప్రజల్లో 420 చీటింగ్ పార్టీగా నిలిచిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలని, ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సూడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు యాదగిరి, సీనియర్ నాయకులు బాల్ రంగం, బాలకృష్ణారెడ్డి, మండల సమన్వయ కర్తలు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఎల్లం, పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్, రైతు సమన్వయ అధ్యక్షులు జనార్దన్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ లు, విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు.